మతం కంటే మానవత్వం ముఖ్యం : పవన్ కళ్యాణ్

by srinivas |
మతం కంటే మానవత్వం ముఖ్యం : పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, సెక్షన్ 144ను జగన్ సర్కార్ ఇష్టానుసారంగా ప్రయోగిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. శుక్రవారం పవన్ మీడియాతో మాట్లాడుతూ… 151 మంది ఎమ్మెల్యేలతో వైసీపీకి ప్రజలు సంపూర్ణ అధికారం ఇచ్చారని గుర్తుచేశారు. ఆ అధికారాన్ని చూసుకొని వైసీపీ ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తోందని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల దాడులకు ఎవరూ భయపడరని, శాంతి భద్రతలను కాపాడాల్సిన వారే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రోడ్లు బాగాలేవంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మా పార్టీ నేతలపై కఠిన చట్టాలు ప్రయోగిస్తూ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 142 ఆలయాలపై దాడులు జరిగాయని, అవన్నీ వైసీపీ ప్రభుత్వమే చేసిందని జనసేన ఎక్కడా విమర్శలు చేయలేదని గుర్తుచేశారు. ఆలయాలపై దాడి జరిగితే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చి, మసీదుపై దాడి చేస్తే.. ప్రపంచమే గళమెత్తేది అని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు బాధ్యత మరిచి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని తెలిపారు. దోషులు ఏ పార్టీ వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మతం కంటే మానవత్వం ముఖ్యం అనేది జనసేన పార్టీ సిద్దాంతం అని వెల్లడించారు. గుడుల కమిటీలపై జనసేన తరపున షాడో కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు.

అంతేగాకుండా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని పోటీ చేయించాలనే డిమాండ్ వ్యక్తమౌతోందని అన్నారు. బీజేపీ జాతీయ స్థాయి నేతలతో తనకు మంచి అవగాహన ఉందని, రాష్ట్రస్థాయి నేతలతో అలాంటి అవగాహన కుదరట్లేదని చెప్పారు. దీనికి కారణం.. కరోనా వైరస్ పరిస్థితులేనని పవన్ స్పష్టం చేశారు. ఇప్పటిదాకా బీజేపీ రాష్ట్రస్థాయి నేతలతో ముఖాముఖిగా కూర్చుని విస్తృతంగా చర్చించింది లేదని అన్నారు. ఎవరు పోటీ చేయాలనే విషయంపై మరో వారం రోజుల్లో స్పష్టత వస్తుందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed