- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బయట కుస్తీ.. లోపల దోస్తీ.. టీఆర్ఎస్, బీజేపీల బండారాన్ని బయటపెట్టాలి
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్, బీజేపీ నాయకులవి చీకటి ఒప్పందాలని, బయట కుస్తీ పడుతున్నట్లు నటించి లోపల మాత్రం దోస్తీ చేస్తాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ తెలిపారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆయన సోమవారం కాంగ్రెస్ ముఖ్య నేతలు, మండలాల ఇన్‌చార్జిలతో ‘జూమ్’ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని గెలిపించాలని, అందుకు ప్రతీ నాయకుడు, కార్యకర్త పూర్తిస్థాయిలో కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నిక కాంగ్రెస్‌కు చాలా కీలకమని, బీజేపీ, టీఆర్ఎస్‌ను ఓడించేందుకు నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్‌కే పోటీ : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీలోనే లేదని, కాంగ్రెస్‌కు, టీఆర్ఎస్‌కు మధ్యనే పోటీ అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో జానారెడ్డి గెలుపు ఇప్పటికే ఖాయమైందని పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగానే బీజేపీ బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. బీజేపీ ఎంపీ సోయం బాబూరావు లాంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ప్రధానికి లేఖ ఇచ్చాడని, ఈ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ వైఖరిని ప్రజలకు తెలపాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చామని ఉత్తమ్ గుర్తుచేశారు. టీఆర్ఎస్ మెడలు వంచి ఉద్యోగ నియామకాలు జరగాలంటే జానారెడ్డి లాంటి నాయకులు శాసనసభలో ఉండాలని ఆయన పేర్కొన్నారు.
అక్రమాలన్నీ టీఆర్ఎస్‌వే..
రాష్ట్రంలో ఎక్కడ అక్రమాలు బయటపడినా టీఆర్ఎస్ ఎమ్యెల్యేల పేర్లు బయటకు వస్తున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రగ్స్ మాఫియాలోనూ నలుగురు టీఆర్ఎస్ ఎమ్యెల్యేలు ఉన్నట్లు చెబుతుండటమే అందుకు నిదర్శనమని అన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఆ ఎమ్యెల్యేలను గుర్తించి వారిని బర్తరఫ్ చేసి విచారణ జరిపి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రచారానికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉందని, నాయకులంతా ప్రత్యేక దృష్టిసారించి జానారెడ్డి గెలుపునకు కృషి చేయాలని సూచించారు.
అన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తా : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
సాగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు పర్యటించి ప్రచారం చేస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. నాయకులంతా ఎవరికి కేటాయించిన గ్రామాల్లో వారు ముమ్మరంగా ప్రచారం చేసి కాంగ్రెస్ విజయం కోసం ప్రణాళిక బద్ధంగా పనిచేయాలన్నారు. ఈ పోలింగ్ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికలు కావాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సాగర్ అభ్యర్థి జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రులు వినోద్, ఆర్ దామోదర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, నాయకులు కుసుమ కుమార్, శివసేనారెడ్డి, వెంకట్, శ్రీకాంత్, మండలాల ఇన్ చార్జీలు తదితరులు పాల్గొన్నారు.