సాగర్ పోరు: ఆ నేతకు ఇదే చివరి అవకాశమా..?

by Anukaran |   ( Updated:2021-03-23 10:40:30.0  )
సాగర్ పోరు: ఆ నేతకు ఇదే చివరి అవకాశమా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరుస ఓటములను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ పై గురిపెట్టింది. అందరికన్నా ముందుగానే అభ్యర్థిని ప్రకటించేసి ప్రచారపర్వంలోనూ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డిని రంగంలోకి దించింది. రెండు పట్టభద్రుల స్థానాల్లో విజయం దక్కడంతో ఊపుమీదున్న గులాబీ దళాన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. జానారెడ్డికి పెట్టనికోటగా ఉండే నాగార్జునసాగర్​లో 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. పోటీచేసేందుకు జానారెడ్డి కొంత తటపటాయించారు. కొడుకు రఘువీర్​ను పోటీకి దింపే ప్రయత్నాలు కూడా చేశారని ప్రచారం సాగింది. కానీ తన ఇద్దరు కొడుకులతో నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టడంతో తానే రంగంలో నిలిచే విషయం స్పష్టమైంది.

మండలిలో అలా..

మండలి ఎన్నికల్లో ఓటమిని కాంగ్రెస్​ సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పట్టభద్రులు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారనే ధైర్యం పెట్టుకుంది. అందుకే హైదరాబాద్​స్థానం నుంచి మరో సీనియర్ నేత జి.చిన్నారెడ్డిని బరిలోకి దింపింది. కానీ ఆయనకు కేవలం 20వేలు ఓట్లు మాత్రమే వచ్చాయి. వరంగల్​స్థానంలోనూ రాములు నాయక్​కు 30,350 ఓట్లు పడ్డాయి. దీంతో కాంగ్రెస్​ను పట్టభద్రులు ఆదరించలేదనే విషయం స్పష్టమైంది. మరోవైపు అభ్యర్థులు కూడా నేతలపై నిందలు వేశారు. కాంగ్రెస్​ రాష్ట్ర నాయకత్వం సమష్టిగా పనిచేయలేదని ఆరోపణలు చేశారు. ఓవైపు ఎంపీ రేవంత్​రెడ్డి, మరోవైపు ఎంపీ ఉత్తమ్​బాధ్యతలు తీసుకున్నారు. అంతే మినహా పార్టీ నేతలు ఎక్కడా కలిసిరాలేదు. ఇది పార్టీ కేడర్​ను కొంత నిరాశకు గురిచేసింది. నల్లగొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి ఎ.రేవంత్​రెడ్డి పార్లమెంట్​సభ్యులుగా ఉన్నప్పటికీ పట్టభద్రుల ఓట్లు సాధించడంలో మాత్రం విఫలమయ్యారు.

సాగర్‌లో ఇప్పుడెలా?

మండలి ఓటమి నేపథ్యంలో నాగార్జున సాగర్ సీటుపై కాంగ్రెస్​శ్రేణుల్లో, ప్రధానంగా కె.జానారెడ్డికి కొంత భయం పట్టుకుందని పార్టీ నేతల టాక్. ఇదిలాఉంటే పార్టీలో నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది. జానారెడ్డి ఇటీవలే రేవంత్​వర్గాన్ని టార్గెట్​చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వర్గం ఎంతమేరకు పని చేస్తుందన్నది అనుమానమే. అటు ఉత్తమ్, ఇటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య విభేదాలు పాతవే. ఇప్పుడు సాగర్​లో జానారెడ్డి గెలిస్తే.. పార్టీలో కూడా మంచి పదవే ఉంటుందనే ప్రచారం కూడా ఉంది.

ఒకవేళ ఓడిపోతే… ఇక జానాకు రాజకీయ సన్యాసం తప్పదా? అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రాజకీయాలకు దూరంగా ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. 2018 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో తిరగడం కూడా తగ్గించేశారు. ఉపఎన్నికలు రావడంతో తన కుమారులను వెంట బెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. సాగర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.

Advertisement

Next Story