అగ్రనేతల లొంగుబాటు పచ్చి అబద్ధం: జంపన్న

by  |
అగ్రనేతల లొంగుబాటు పచ్చి అబద్ధం: జంపన్న
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు అగ్రనేతలు గణపతి, కటకం సుదర్శన్, మల్లోజుల, రాజిరెడ్డి లొంగుబాటు ప్రచారంపై మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న స్పందించారు. ఒకేసారి ఇంతమంది కేంద్ర కమిటీ సభ్యుల లొంగుబాటు జరగదన్నారు. గణపతి లొంగిపోవాలంటే పార్టీలో నిర్ణయం జరగాలని, 43ఏళ్ల పాటు పార్టీని మోసిన వ్యక్తి ప్రచారం చేస్తూ బయటకు రాడని బుధవారం ఓ న్యూస్‌ ఛానల్‌తో అన్నారు. గణపతి, వేణుగోపాల్, కటకంతో కలిసి 20ఏళ్ల పాటు పనిచేశానని తెలిపారు. ప్రస్తుతం కొందరు అగ్రనేతలకు అనారోగ్య సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, కానీ అది సాధారణ విషయమేనన్నారు.

ఏ మావోయిస్టు కూడా అనారోగ్య కారణాలతో లొంగిపోడని, గణపతి లాంటి వ్యక్తి అలాంటి పరిస్థితుల్లో లేరని చెప్పుకొచ్చారు. ఎవరైనా లొంగి పోవాలనుకుంటే మావోయిస్టు పార్టీనే సహకరిస్తుందని, తాను లొంగిపోతానంటే కూడా పార్టీ సహకరించిందన్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారిని పార్టీ కాపాడుకుంటుందని తెలిపారు. గణపతి స్వచ్ఛందంగా మావోయిస్టు సెక్రటరీ పదవి నుంచి తప్పుకున్నారని, 2017లోనే నంబాల కేశవరావు గణపతి స్థానంలో బాధ్యతలు తీసుకున్నారన్నారు. పార్టీలో ఆంధ్రా, తెలంగాణ వంటి విభేదాలు లేవని, అలాంటివన్ని బయటి వ్యక్తుల సృష్టే అన్నారు. ప్రస్తుతం ఐదుగురు అగ్రనేతలు బయటకు రావడం అసంభవమని, ఒక వేల అదే జరిగితే పార్టీకి తీరని నష్టం జరుగుతుందన్నారు.


Next Story

Most Viewed