మేము ఈటల వెంటే ఉంటాం.. ప్రాణ భయం ఉంది

by Sridhar Babu |   ( Updated:2021-05-16 03:49:49.0  )
మేము ఈటల వెంటే ఉంటాం.. ప్రాణ భయం ఉంది
X

దిశ, హుజురాబాద్: తాము మాత్రం మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెన్నంటే ఉంటామని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేసిని స్వప్న స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… తనతో పాటు 13మంది కౌన్సిలర్లు కూడా ఈటలకు మద్దతు తెలుపుతున్నారని ప్రకటించారు. కొందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రుల దగ్గరి నుండి బెదిరింపు కాల్స్ చేస్తున్నారని, ప్రలోభాలకు కూడా గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈటలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ రాత్రికి రాత్రే ఆర్డర్లు ఇస్తూ అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఈటల రాజేందర్ను తొలగించలేరని స్వప్న స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయం నుండి కేసీఆర్ వెన్నంటే ఉండి అహర్నిశలు ఈటల పని చేశారని, అలాంటి నాయకునిపై భూ కబ్జా ఆరోపణలు చేయడం భావ్యమా అని ఆమె ప్రశ్నించారు. ఈటల మీద ఇంత కక్షపూరిత రాజకీయం చేయడం సరికాదని, ఈటలను ఒంటరి చేద్దామన్న ఆలోచన రావడం సిగ్గు చేటని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదారణ ఉన్న ఆయన ఒక శక్తి అని మరిచి పోకూడదన్నారు. తామంతా ఈటల ఫోటో పెట్టుకొని గెలిచామని, ఆయన దయ వల్లనే మాకు ఈ పదవులు వచ్చాయని స్వప్న వివరించారు.

హుజురాబాద్ నియోజక వర్గంలో అణచివేత ధోరణి సాగిస్తున్నారని, అది మంచిది కాదన్నారు. తమకు ఈటలకు ప్రాణ భయం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ స్థానాలు, కేంద్ర ప్రభుత్వానికి ఒకటే విన్నవించు కుంటున్నామని, దయ చేసి తమను కాపాడాలని వేడుకుంటున్నామని స్వప్న అన్నారు. తల్లి నుండి బిడ్డను వేరు చేసినట్లు నియోజక వర్గ ప్రజల నుండి ఈటలను వేరు చేయాలనుకోవడం సమంజసం కాదని, టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రిటిష్ పాలనను తలపిస్తోందని, నియోజక వర్గ ప్రజలను కాపాడాలని న్యాయస్థానాలను కోరారు.

Advertisement

Next Story

Most Viewed