అంబులెన్సులు.. అత్యాధునిక సదుపాయాలు

by srinivas |   ( Updated:2020-07-01 08:46:55.0  )
అంబులెన్సులు.. అత్యాధునిక సదుపాయాలు
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ ప్రజారోగ్యంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. సత్యం రామలింగ రాజు ప్రవేశపెట్టిన 108 సేవలు ఈ రోజు మరింత విస్తరించాయి. ఏపీలో ఏ పల్లెలో అనారోగ్య సమస్య వచ్చినా ఆదుకునేందుకు భరోసా కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1088 కొత్త అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చారు. దివంగత ముఖ్యమంత్రి హయాంలో 108 అంబులెన్స్‌లు రాష్ట్ర వ్యాప్తంగా సేవలందించాయి. వాటిని మరింత విస్తృతం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరిన్ని అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం ఉదయం విజయవాడ నడిబొడ్డున ఉన్న బెంజ్ సర్కిల్‌లో సీఎం జెండా ఊపి 1088… 108, 104 వాహనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.

అత్యాధునిక సదుపాయాలు:

ఈ అంబులెన్స్‌లలో అత్యాధునిక, అత్యవసర సేవలందించేందుకు 412 వాహనాలను కేటాయించారు. మరో36 అంబులెన్స్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఇంకా 282 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు కాగా, 104 అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ అబులెన్స్‌లు మరో 26 అంబులెన్స్‌లు నియోనేటల్ అంటే చిన్నపిల్లల అనారోగ్యాలకు సంబంధించినవి కావడం విశేషం. అంబులెన్స్‌లు గతంలో ఏడాదికి 6,33,600 కేసుల్లో సేవలందించగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో ఏడాదికి 12 లక్షల మందికి సేవలందించేలా తీర్చిదిద్దారు. బేసిక్ లైఫ్ సపోర్ట్ (బీఎల్‌ఎస్‌) అంబులెన్స్‌లలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్‌ఎస్‌) అంబులెన్స్‌లలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు అమర్చారు. నియో నేటల్‌ అంబులెన్స్‌లలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను కూడా అమర్చారు.

104 వాహనాల సౌకర్యాల విషయానికి వస్తే…

ప్రతి మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ)లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ ఉంటారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)తో ఈ మొబైల్ యూనిట్ అనుసంధానంగా పని చేస్తుంది. దీంతో మారుమూల కుగ్రామాలకు సైతం వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. రోగులకు అప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేసే సౌకర్యాలు ఈ మొబైల్ మెడికల యూనిట్‌లో ఏర్పాటు చేశారు. రోగులకు అవసరమైన ఔషధాలను ఉచితంగా అందజేయనున్నారు.

ఈ 104 వాహనంలో ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌ (ఏవీఎల్‌టీ)తో పాటు, గ్లోబల్‌ పొజిషనింగ్‌ విధానం (జీపీఎస్‌) కూడా అందుబాటులో ఉంటుంది.అలాగే ఆధార్‌ కోసం బయోమెట్రిక్‌ ఉపకరణాలు, రోగుల డేటాను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయడం కోసం ట్యాబ్, పర్సనల్‌ కంప్యూటర్‌ (పీసీ) కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. దీంతో రోగుల ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డు తయారు చేయడం సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్ ఆరోగ్య అవసరాలకు ఇవి ఉపయోగపడనున్నాయి.

వేగంగా ఆరోగ్య సేవలు గతంలో బాధితుడు లేదా ఆ పరిసరాల్లోని వారు ఫోన్ చేసిన అరగంటలో 108 వాహనాలు సంఘటనా స్థలికి చేరుకునేవన్న అభిప్రాయం బలంగా ఉంది. అయితే ఇప్పుడు ఆ సమయాన్ని సవరిస్తూ.. పట్టణ ప్రాంతాల్లో బాధితులు ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో బాధితులు ఫోన్ చేసిన 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లోని బాధితులు ఫోన్ చేసిన 25 నిమిషాల్లో అంబులెన్స్‌లు చేరే విధంగా ప్రణాళిక రూపకల్పన చేశారు. మూడు మండలాలకు ఒక అంబులెన్స్ నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.

అతే కాకుండా, ప్రతి అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ (ఈఆర్‌సీ)తో అనుసంధించారు. దీంతో ఫోన్‌ చేసిన వారిని వేగంగా ట్రాక్‌ చేసి వారికి అవసరమైన వైద్యం సత్వరమే అందించే వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే, అంబులెన్స్ ఉద్యోగుల్లో బాధ్యత తీసుకొచ్చేదుకు ప్రతి అంబులెన్స్‌లో ఒక కెమెరా, ఒక మొబైల్‌ డేటా టెర్మినల్‌ (ఎండీటీ), మొబైల్‌ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో అంబులెన్స్ ప్రతి కదలికను గుర్తించే వెసులుబాటు కలుగుతుదని ప్రభుత్వం భావిస్తోంది.

108 ఉద్యోగుల పంట పండింది

ప్రజారోగ్య రంగంలో అత్యవసర సేవలు అందిస్తున్న 108 సిబ్బందికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ శుభవార్త అందించారు. డ్రైవర్ల జీతాన్ని ప్రస్తుత రూ. 10 వేల నుంచి సర్వీసును బట్టి రూ. 18 వేల నుంచి రూ. 20 వేల వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలను ప్రస్తుత రూ.12 వేల నుంచి సర్వీసును బట్టి రూ.20 నుంచి రూ 30 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. మెడికల్ టెక్నీషియన్ల జీతాలను రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతో 108 సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed