అప్పులు తేవడం తప్ప జగన్‌కు ఇంకేమీ చేతకాదు.. చంద్రబాబు

by srinivas |
babu
X

దిశ, ఏపీ బ్యూరో: పెట్రోల్, డీజిల్ ధరలపై దేశంలోని అన్ని రాష్ట్రాలు దిగి వస్తుంటే ఏపీ మాత్రం ఎందుకు దిగిరావడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా.. రాష్ట్రంలో పెట్రో ధరలు ఎందుకు తగ్గించడం లేదో చెప్పాలని నిలదీశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పెట్రోధరల అంశంపై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ ధరల పెంపునకు సంబంధించి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో.. ప్రజాసంకల్పయాత్రలో చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్స్‌ను ప్రదర్శించారు. అప్పట్లో జగన్ బాదుడే.. బాదుడు అంటూ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ ఇప్పుడు మీరేం చేస్తున్నారని చంద్రబాబు నిలదీశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ అత్యధిక ధర రాజస్థాన్‌లో ఉంటే ఆ తర్వాత స్థానం ఆంధ్రప్రదేశ్‌దేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక రేట్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు.

జగన్ పాలన చూస్తుంటే తుగ్లక్ పాలన గుర్తొస్తుందని ధ్వజమెత్తారు. దేశంలోని చిన్న చిన్న రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై రూ. 7 వరకూ తగ్గించాయని.. కానీ ఏపీలో మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించే ఆలోచన చేయకపోవడం గమనార్హమన్నారు. ప్రజల్ని పన్నుల రూపంలో బాదడం.. అప్పులు తేవడం మినహా ఈ ముఖ్యమంత్రికి ఇంకేమీ చేతకాదని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచకం, విధ్వంసం రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారని.. ఇదేమీ వైఎస్ జగన్ జాగీరు కాదంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.

ఈనెల 9న టీడీపీ నిరసనలు

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై 16 – 17 రూపాయాలు తగ్గించాలని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్ చేశారు. తాను అధికారంలో వస్తే..పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తానని నాడు ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారని.. ముఖ్యమంత్రిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చంద్రబాబు సవాల్ విసిరారు.

Advertisement

Next Story

Most Viewed