ఐటీఐఆర్ చుట్టూ తెలంగాణ రాజకీయం.. లాభం ఎవరికి..?

by Anukaran |
ఐటీఐఆర్ చుట్టూ తెలంగాణ రాజకీయం.. లాభం ఎవరికి..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. తప్పు మీదంటే.. మీదని రెండు పార్టీల నేతలు దూషించుకుంటున్నాయి. అందులో ఐటీఐఆర్ (ఇన్ఫర్మెషన్​ టెక్నాలజీ ఇన్వెస్ట్​మెంట్​ రీజియన్​) కీలకాంశంగా మారింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి కేంద్రం అడ్డుకట్ట వేస్తున్నదని, అందువల్లనే ఐటీఐఆర్ లాంటి ప్రాజెక్టుల విషయంలో ఎన్ని లేఖలు రాసినా స్పందన కరువైందని మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వమే నిబంధనల ప్రకారం కార్యాచరణ చేపట్టలేదని, అందువల్లనే ఆ ప్రాజెక్టుకు అనుమతులు కేంద్రం నుంచి లభించలేదని బీజేపీ అంటోంది.

దుబ్బాక ఎన్నికల వరకూ ఈ రెండు పార్టీల మధ్య పెద్దగా రాజకీయ వైషమ్యం లేదు. కానీ దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత గ్యాప్ పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి అది మరింత తీవ్రమైంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలూ ఉప్పు-నిప్పులా వ్యవహరిస్తున్నాయి. ఐటీఐఆర్ విషయంలో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నాయి. కేంద్రానికి రాసిన లేఖలను టీఆర్ఎస్ బయటపెడుతూ ఉంటే ‘కాగ్’ రిపోర్టులోనే ఉందంటూ బీజేపీ చెబుతున్నది. రెండు పార్టీల నేతలు బహిరంగ లేఖలు రాసుకుంటున్నారు. ఇంతకూ ఐటీఐఆర్ విషయంలో లోపమెక్కడుంది? ఎవరిది పొరపాటు? దాదాపు ఆరేళ్ళుగా దీనిపై కొట్లాడుకోని ఈ రెండు పార్లు ఇప్పుడే దాన్ని ఎందుకు ప్రచారాస్త్రంగా మల్చుకున్నాయి? ఎన్నికల సమయంలో ఓటర్లకు వాస్తవాలేంటో తెలియని గందరగోళానికి పాల్పడుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి అందని నివేదిక

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి యుపీఏ ప్రభుత్వం 2008లో ఐటీఐఆర్ పాలసీని తీసుకొచ్చింది. ఆ ప్రకారం హైదరాబాద్‌లో ఐటీఐఆర్ నెలకొల్పడానికి 2013 నవంబరు 13న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 3,275 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం కేవలం ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) శాఖ నుంచి మాత్రమే కాకుండా రైల్వే, ఉపరితల రవాణా, పట్టణాభివృద్ధి తదితర మంత్రిత్వశాఖల నుంచి కూడా నిధులను సమీకరించుకోవాలని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఇతర రకాల సహకారాన్ని, సమన్వయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీఐఆర్ విషయంలో మంత్రి స్థాయిలో కేటీఆర్, ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ పలు మార్లు కేంద్రానికి లేఖలు రాశారు. ప్రధానమంత్రిని, ఐటీశాఖ మంత్రిని కలిసి వివరించారు. ఆ ప్రకారం 2017 జనవరి 11న ఢిల్లీలో ఐటీఐఆర్‌పైన సమావేశం జరిగింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రైల్వే, పట్టణాభివృద్ధి, ఉపరితల రవాణా మంత్రిత్వశాఖల తరఫున అధికారులు, తెలంగాణ ఐటీ శాఖ తరఫున అధికారులు హాజరై చర్చించారు. వివిధ శాఖల నుంచి ఆర్థిక వనరులను సమీకరించుకోవాల్సి ఉన్నందున హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టు నివేదికను ఈ శాఖలకు పంపడంతో పాటు కేంద్ర ఐటీ శాఖకు కూడా పంపాలన్న నిర్ణయం జరిగింది. కానీ తెలంగాణ నుంచి ఎలాంటి అలాంటి నివేదిక ఏదీ అందని కారణంగా ఐటీఐఆర్ మంజూరు నిర్ణయం జరగలేదని కేంద్ర ఐటీ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే వివరించారు.

బీజేపీ, టీఆర్ఎస్ బ్లేమ్ గేమ్

రాష్ట్ర ప్రభుత్వం నుంచి సకాలంలో తగిన సహకారం, నివేదిక కేంద్రానికి అందినట్లయితే ఇప్పటికే ఐటీఐఆర్ మంజూరై ఉండేదని, ఇప్పటివరకూ అలాంటి ప్రకటన రాకపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. కేంద్రానికి సుమారు ఇరవై లేఖలు రాసినా స్పందన లేదని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఇంతకాలం ఈ రెండు పార్టీల మధ్య లేని ఐటీఐఆర్ రగడ ఇప్పుడు మాత్రమే ఎందుకు వచ్చిందనేది అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఆరున్నరేళ్ళలో 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని కేటీఆర్ శాఖలవారీ వివరాలను అందజేసిన తర్వాత వచ్చిన దుమారంతో చివరికి పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఐటీఐఆర్ వైపు మళ్ళింది. కొలువుల అంశం పక్కకు పోయి ఐటీఐఆర్ ప్రధాన ప్రచార అస్త్రంగా మారింది. ఒకదానిపై మరొకటి దుమ్మెత్తి పోసుకోడానికి ఈ అంశాన్ని వాడుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా 1.32 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని బీజేపీ ఎత్తి చూపిన వెంటనే దానిని తిప్పికొట్టడానికి టీఆర్ఎస్ .. కేంద్రం వైఫల్యాలను ఎత్తి చూపడాన్ని మార్గంగా ఎంచుకుంది. కేంద్రం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పిందని, ఇప్పటిదాకా 12 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందా అని కేటీఆర్ ఎదురు దాడికి దిగారు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకదాన్ని ఒకటి విమర్శించుకోడానికి ఐటీఐఆర్‌ను ఈ రెండు పార్టీలూ శక్తివంచన లేకుండా వాడుకుంటున్నాయి.

లోక్‌సభ సాక్షిగా కేంద్రం వివరణ

ఐటీఐఆర్ విషయంలో 2017 జనవరిలో జరిగిన సమావేశం సందర్భంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ నివేదిక సమర్పించాల్సి ఉందని, నాలుగేళ్ళు దాటినా ఇప్పటికీ (ఫిబ్రవరి 11, 2021) అది అందలేదని కేంద్ర ఐటీ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే రాజ్యసభలో టీఆర్ఎస్ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2019 జూలై 3వ తేదీన సైతం కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభలో టీఆర్ఎస్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఇదే సమాధానాన్ని చెప్పారు. యూపీఏ హయాంలో ఐటీఐఆర్ పాలసీ రూపొందించినప్పటి పరిస్థితులకూ ఇప్పటి పరిస్థితులకు తేడా ఉందని మంత్రి సంజయ్ ధోత్రే ఆ వివరణలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార రంగాన్ని ప్రోత్సహించడానికి అనేక పాలసీలు ఉన్నాయని, యూపీఏ హయాంలోని ఐటీఐఆర్ పాలసీతో పోల్చుకుంటే ఇప్పటి ప్రభుత్వంలో అమల్లోకి వచ్చిన ఇతర పాలసీలు చాలా మెరుగ్గా ఉన్నాయని, ఇప్పుడు ఐటీఐఆర్ లాంటివి అవసరమే లేదని వివరించారు.

డీఎంఐసీ, స్మార్ట్ సిటీస్, ఎలక్ట్రానిక్స్ పార్కులు, ఇండస్ట్రియల్ పార్కులు, ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లు, ఇండస్ట్రియల్ క్లస్టర్లు.. ఇలా అనేక పాలసీలు ఐటీఐఆర్ పాలసీకంటే భేషుగ్గా ఉన్నాయని, ఇప్పటి పరిస్థితుల్లో ఐటీఐఆర్ అవసరం లేనే లేదని పేర్కొన్నారు. పైగా కొత్త పథకాలతో ఆర్థిక వనరులు కూడా సమకూర్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో 2017 జనవరిలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చి ఉన్నట్లయితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉండేదో ఇప్పటికే స్పష్టమయ్యేది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ నివేదిక ఇవ్వకపోవడం తెలంగాణ వైపు నుంచి జరిగిన పొరపాటు. అదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పంతా అని చెప్పి తప్పించుకోడానికి కేంద్రానికి ఒక అవకాశం దొరికింది. రాజకీయ పార్టీలు సరిగ్గా ఎన్నికల సమయంలో ఇలాంటి అంశాలను తెరపైకి తేవడం, రాజకీయ లబ్ధి పొందడం ఆనవాయితీ. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే బ్లేమ్ గేమ్ జరుగుతోంది.

Advertisement

Next Story