పర్సనల్ కేర్ బ్రాండ్ మదర్ స్పర్శ్‌లో 16 శాతం వాటా కొనుగోలు చేసిన ఐటీసీ..

by Harish |
itc
X

దిశ, వెబ్‌డెస్క్: సహజ వ్యక్తిగత సంరక్షణ, ఆయుర్వేద ఉత్పత్తుల కంపెనీ మదర్ స్పర్శ్‌లో దేశీయ ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ సంస్థ 16 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది. మదర్ స్పర్శ్ కంపెనీ పిల్లలతో పాటు తల్లులకు కావాల్సిన మెరుగైన ప్రీమియం ఆయుర్వేద, పర్సనల్ కేర్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. సబ్‌స్క్రిప్షన్ ఒప్పందంలో భాగంగా 16 శాతం వాటా కోసం ఐటీసీ సంస్థ రూ. 20 కోట్లను చెల్లించనుందని, ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి 8 నెలల వ్యవధిలో వాటా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు వెల్లడించింది.

రెండు దశల్లో ఈ లావాదేవీ జరుగుతుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ ప్రతిపాదనకు సంబంధించి వాటాదారుల నుంచి ఆమోదం దక్కాల్సి ఉంది. వినియోగదారులకు నేరుగా ఉత్పత్తులను విక్రయిస్తున్న మదర్ స్పర్శ్‌ కంపెనీ 2016లో స్థాపించబడింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 15.44 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ‘ఐటీసీ లాంటి దిగ్గజ సంస్థతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో మరింత మెరుగైన వ్యూహాలతో ముందుకెళ్తామని, రాబోయే 3-5 ఏళ్లలో కంపెనీ ఆదాయం రూ. 300 కోట్లను సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని’ మదర్ స్పర్శ్ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ హిమాన్షు గాంధీ అన్నారు.

Advertisement

Next Story