భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ ప్రణాళికపై ఇంటెల్ అభినందనలు

by Harish |
భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ ప్రణాళికపై ఇంటెల్ అభినందనలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ప్రభుత్వం సెమీకండక్టర్ డిజైన్, తయారీ ప్రోత్సాహకాల కోసం రూ. 76,000 వేల కోట్ల పీఎల్ఐ పథకానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన దిగ్గజ చిప్‌ల తయారీ కంపెనీ ఇంటెల్ భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పథకానికి సంబంధించి ఇంటెల్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ రణధీర్ ఠాకూర్ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. సెమీకండక్టర్ల డిజైన్‌తో పాటు తయారీ ప్రోత్సాహకాలు, ఎలక్ట్రానిక్స్, చిప్‌ల తయారీ హబ్‌గా భారత్‌ను నిలపడానికి నిర్ణయం తీసుకున్నందుకు ట్విట్టర్ ద్వారా ఆయన ప్రభుత్వాన్ని అభినందించారు.

సెమీకండక్టర్ల డిజైన్, తయారీ, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్, టెస్టింగ్ లాంటి అన్ని అంశాలతో కూడిన ప్రణాళిక రూపొందించడం సంతోషంగా ఉందని రణధీర్ అన్నారు. దీనికి స్పందించిన కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఇంటెల్ వెల్ కమ్ టు ఇండియా’ అని బదులిచ్చారు. చిప్‌ల తయారీకి సంబంధించి భారత ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు చైనా, తైవాన్ లాంటి దేశాలపై ఆధారపడుతున్నాయి. ఇన్నేళ్లలో స్థానికంగా వీటి తయారీకి కావాల్సిన యూనిట్ల ఏర్పాటు జరగలేదు. ఇటీవల మారిన పరిస్థితుల్లో దేశీయంగా ఎలక్ట్రానిక్ పరిశ్రమలు భారీగా పెరిగాయి. వీటి ప్రోత్సాహానికి తయారీ కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల లక్షల మందికి ఉపాధి, పరోక్ష ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. రాబోయే 3-4 నెలల్లో సెమీకండక్టర్ల యూనిట్, డిజైన్, ప్యాకేజీ కంపెనీలకు ఆమోదం లభించనున్నట్టు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed