వామన్‌ రావు దంపతుల హత్య కేసులో వసంత్ రావు సేఫ్?

by Sridhar Babu |   ( Updated:2021-02-21 20:44:21.0  )
vaman rao murder incident
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: జీరో ఎఫ్ఐఆర్ లో ఏ1 నిందితునిగా ఉన్న రిటైర్డ్ ఇంజనీర్ వసంత్ రావు సేఫ్ అయ్యారు. హైకోర్టు అడ్వకేట్లు గట్టు వామన్ రావు, నామణిల హత్య కేసులో మొదట వసంత్ రావు పేరును ఏ1గా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ఏ2గా ఉన్న కుంట శ్రీనివాస్​ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత సీన్ మారింది. ఈ కేసులో వసంత్ రావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు కుంట శ్రీనివాస్ చెప్పడంతో ఆ తరువాత జారీ చేసిన ఎఫ్ఐఆర్ లో పోలీసులు వసంత్ రావు పేరును తొలగించారు. అయితే వసంత్ రావు ప్రమేయం ఉందా? లేదా? అన్న విషయంపై మరింత దర్యాప్తు చేస్తామని అప్పుడే ఐజీ నాగిరెడ్డి ప్రకటించారు. గుంజపడగ గ్రామంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా వసంత్ రావుకు, వామన్ రావు కుటుంబానికి మధ్య విబేధాలు ఉన్నప్పటికీ మర్డర్ కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధమూ లేదని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. ఈ క్రమంలో గట్టు వామన్ రావు మర్డర్ కేసులో వసంత్ రావు సేఫ్ గా బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం వసంత్ రావును రోజూ కమిషనరేట్ కు వచ్చి హాజరు కావాలని చెప్పడంతో ఆయన రోజూ ఉదయం సీపీ ఆఫీస్​ వెళ్లి సాయంత్రం తిరిగి వెళ్తున్నారు.

కత్తులు ఇచ్చానంతే

తన షాపుకు వచ్చి బిట్టు శ్రీను కత్తులు ఇవ్వాలని అడిగితే కత్తులు ఇచ్చానంతే కానీ ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ కుమార్ పోలీసుల ముందు చెప్పినట్టు విశ్వాసనీయ సమాచారం. బిట్టు శ్రీను వచ్చి కత్తులు ఇవ్వాలంటే కొబ్బరి బొండాల కోసం వాడే కత్తులు ఇచ్చానని, వాటిని వామన్ రావును చంపేందుకు ఉపయోగిస్తారని తనకు ఏ మాత్రం తెలియదని అతను వివరించినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed