- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఇగ.. పోలీసు రాజ్యం!
ప్రజాస్వామిక తెలంగాణ, సుభిక్ష తెలంగాణ, హక్కుల తెలంగాణ, అసమానతలు లేని తెలంగాణ, పీడన లేని తెలంగాణ, విద్యావకాశాలు పెరిగే నిరుద్యోగం లేని తెలంగాణ ఇలా రకరకాల ఆకాంక్షలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బలంగా ప్రబలిన సందర్భం గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకంటే.. ఆనాడు భౌగోళిక తెలంగాణే వీటన్నింటికి సమాధానమని బలంగా విశ్వసించిన మేధావి వర్గం ఉన్నది. అందుకే భౌగోళిక తెలంగాణ కోసం ఉద్యమం చేసిన టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ నాయకత్వంలో సబ్బండ వర్గాలు పోరాడిన సంగతి తెలిసిందే. అయితే, నాటి ఉద్యమ నాయకులు ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే వల్లె వేసిన కొత్త పదం ‘బంగారు తెలంగాణ’.
కల సాకారమైన వేళ..
60 ఏళ్ల కల.. దాదాపు పాతికేండ్ల ఉద్యమ ప్రస్థానం తర్వాత ప్రత్యేక తెలంగాణ 2014లో ఆవిర్భవించింది. ఆ కల ఆవిష్కరించబడి ఆరేండ్లు కావస్తోంది. ఈ ఆరేండ్లలో తెలంగాణ ‘గమనాన్ని’ పరిశీలిద్దాం. నీళ్లు.. నిధులు.. నియామకాలు నినాదత్రయంతో తెలంగాణ సమాజాన్ని ఏకం చేసింది మేధావి వర్గం, ప్రొఫెసర్ జయశంకర్. నీళ్లు అనగానే ప్రస్తుత పాలక వర్గం కాళేశ్వరం ప్రాజెక్టునే చూపిస్తోంది. అయితే, ప్రతి ఎకరా నీరు పారించడం సాధ్యమేనా అనే అంశంపై ఇప్పటికైనా చర్చ జరగాల్సిందే. నాడు ఎవరికైతే(ఆంధ్రా కాంట్రాక్టర్లకు) ప్రాజెక్టులు ఇవ్వడాన్ని నిరసించామో, నేడు అవే సంస్థలకు కట్టబెట్టడం గమనార్హం. నిధుల అంశంపై బలంగా ఉద్యమం జరిగింది. తెలంగాణ మిగులు నిధులు ఆంధ్రాలో ఖర్చు పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఉద్యమ సమయంలో ఆరోపించారు. మరి నేడు నిధులు ఎక్కడ ఖర్చయ్యాయనేది కూడా తెలియాలి. నాడు రూ.50 వేల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రం నేడు రూ.2 లక్షల కోట్లు అప్పుల ఊబిలోకె వెళ్లింది నిజం కాదా..
నియామకాల ఊసేలేదు..
స్వరాష్ట్రం ఏర్పాడిన తొలి అసెంబ్లీలో స్వయంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ లక్షా 10 వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయనీ, వాటిని భర్తీ చేస్తామని చెప్పారు. చెప్పి ఆరేండ్లు కావస్తోంది. ఇప్పటివరకు భర్తీ అయిన ఉద్యోగాలెన్ని పాతికవేలు మాత్రమే. మరి నిరుద్యోగ యువతకు చెప్పే సమాధానమేది.. పైగా 2018 ముందస్తు ఎన్నికల సందర్భంగా సీఎం గారిచ్చిన నిరుద్యోగ భృతి హామీ నీటి మూటేనా?యువత ప్రశ్నించాలి.
నాటి మాటలు మరిచిరా సారూ?
రానున్న ప్రత్యేక తెలంగాణలో ప్రజలకు సంపూర్ణ హక్కులుంటాయనీ, పౌర హక్కుల సంఘానికి తాను అధ్యక్షుడిగా ఉంటానని ఉద్యమ నేత కేసీఆర్ చెప్పారు. అయితే, ఉద్యమపార్టీ నుంచి ఫక్తు రాజకీయపార్టీగా అనంతరం చేసిన ప్రభుత్వ చర్యల్లో ఒకటి. ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌పై ఉక్కుపాదం మోపడం. హైకోర్టు మొట్టికాయలతోనే దాన్ని పునరుద్ధరించడం. విద్యపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఎట్లా ఉన్నది.. చూస్తే హేతుబద్ధీకరణ పేరిట 4 వేల పాఠశాలలను మూసేసింది. అయితే, రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట ప్రచారార్భాటం చేయడం తెలిసిందే. కేజీ టు పీజీ స్కీమ్ అమలుపై యోచిస్తున్నట్టు కనబడటం లేదు. కానీ, రియల్ ఎస్టేట్, ఐటీ పరిశ్రమల విస్తరణకు సై అంటోంది.
ఇదేమి రాజ్యం?
రాజ్యాంగంలోని అధికరణ 19 బీ ప్రకారం ప్రతి పౌరుడూ సభలూ, సమావేశాలు జరుపుకోవచ్చు. కానీ, తెలంగాణలో ఇన్‌హౌస్ సభలకు కూడా అనుమతులు తీసుకోవాల్సిందేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. పౌర హక్కుల గొంతులు మూగబోతున్న ఘటనలూ ఉన్నాయి. వరవరరావు, కాశీం తదితరుల అరెస్టులూ జరుగుతున్నాయి. అయితే, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తలమానికమని నాయకులు ప్రగల్బాలు పలుకుతున్న సంగతి తెలిసిందే. అసలు విషయం ఏమిటంటే.. అభివృద్ధి సంక్షేమం, శ్రేయోరాజ్యంలో తెలంగాణ నెం.1 అవునో కాదో తెలియదు కానీ, పోలీసు రాజ్యంగా మాత్రం వర్ధిల్లే అవకాశముందని నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన కేంద్ర హోం శాఖ బ్యూరో ఆన్ పోలీస్ రీసెర్చ్ వారి డాటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ గణాంకాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా పోలీసులు ఉపయోగిస్తున్న సీసీ కెమెరాల్లో 64 శాతం పైగా (2,75,528) తెలంగాణవేనని తేల్చారు. తమ ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రజలు పోరుబాట పట్టినప్పుడు ప్రభుత్వం పోలీసులను ఉపయోగించివారిని అణచివేసేందుకు వెనుకాడదనీ, అప్పుడు పోలీసు రాజ్యంగా తెలంగాణ మారుతుందని ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసుల రిక్రూట్‌మెంట్లు జరిగిన మాట వాస్తవం. పైగా ఇంకో 6 నెలల్లో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పడుతుందని ప్రభుత్వం చెబుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు రాజ్యం అవుతుందేమో అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు పోలీసురాజ్యం కొత్తేమీ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. చరిత్ర పరిశీలిస్తే నిజాం పాలన తర్వాత సాగింది సైనిక పాలనేననీ, ఆ తర్వాత ఆపరేషన్ పోలోజరిగిందన్న విషయం ప్రభుత్వం గుర్తరెగాలంటున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం నేల విడిచి సాము చేయొద్దని ఉద్యమ కాలం నాటి ఆకాంక్షలు, తమ ఎన్నికల హామీలు గుర్తుకు తెచ్చుకోవాలని, వాటి అమలుకు చిత్తశుద్ధితో ప్రతినబూని, చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.