కరోనా అంటే కేసీఆర్‌కు కామెడీనా?

by Ramesh Goud |
dasoju-sravan 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా అంటే సీఎం కేసీఆర్‌కు కామెడీగా ఉందని, ఆయన తీరు బాధ్యతారాహిత్యానికి పరాకాష్టలా మారిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పారాసిటమాల్ వేసుకుంటే చాలని ఫస్ట్ వేవ్ సమయంలో సీఎం అపహాస్యం చేశారని, అలా చేయడం వల్ల లక్షల మంది తెలంగాణ ప్రజలు మూల్యం చెల్లించుకున్నారన్నారు. అసలు కరోనా లేదని నేడు డోలో ట్యాబ్లెట్ పేరు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

కరోనా రెండో దశని ఎదుర్కోవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తి విఫలమైందన్నారు. తప్పుడు లెక్కలు చెప్పి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. కేసీఆర్ సెకెండ్ వేవ్ నుంచి కూడా పాఠాలు నేర్చుకోలేదని, కరోనా లేకపోతే మంత్రి కేటీఆర్, డ్రగ్స్ యాక్ట్ ని అతిక్రమించి మరీ ట్విట్టర్ వేదికగా రెమిడిసివిర్, బ్లాక్ ఫంగస్ మందులు ఎందుకు పంపిణీ చేశారని దాసోజు ప్రశ్నించారు. ఒక్క ఖమ్మంలోనే 1420 మంది పిల్లలకి కరోనా సోకిందని, ఈ సంఖ్య పెరిగే అవకాశముందని డాక్టర్లు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కానీ సీఎం కేసీఆర్ మాత్రం థర్డ్ వేవ్ రాదని అప్పుడే తేల్చేశారని ఎద్దేవా చేశారు. కరోనా థర్డ్ వేవ్ రాదని ఏ ప్రాతిపాదికపైన కేసీఆర్ చెబుతున్నారో సమాధానం చెప్పాలని దాసోజు డిమాండ్ చేశారు. వాసాలమర్రికి, ఎర్రవల్లికి ఒక న్యాయం, రాష్ట్రంలోని మిగతా 12 వేల పల్లెలకో న్యాయమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేసీఆర్ మాస్కులెందుకు? మా ఎమ్మెల్యే, మంత్రులు మాస్కులు లేకుండానే కరోనా కట్టడి చేస్తారని మాట్లాడారని, అవసరమైతే రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసి కరోనాను తెలంగాణ నుంచి తరిమికొడతామని ఇప్పుడు పట్టించుకోవడం లేదని దాసోజు ఆరోపించారు.

సెకెండ్ వేవ్ వచ్చి వేలాది మంది ఆక్సీజన్ బెడ్స్ లభించక, టీకాలు లభించక లక్షలమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. దాదాపు ఏడాదిన్నరగా ప్రగతి భవన్ నుంచి కాలు బయటపెట్టని కేసీఆర్.. నేడు బయటికి వచ్చి అసలు కరోనానే లేదని చెప్పడం కేసీఆర్ లెక్కలేని తనానికి నిదర్శనమని విమర్శలు చేశారు. ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీ తగ్గించండని రెండు నెలలుగా కోరుతున్నా.. పట్టింపు లేదని, కానీ కోర్టు హియరింగ్ ఉందని అక్కడ చూపించడానికి మాత్రమే రాత్రికిరాత్రి ఏదో జీవో తెచ్చారని మండిపడ్డారు.

Advertisement

Next Story