పర్మిషన్ ఓచోట.. తవ్వేది మరోచోట

by Sridhar Babu |   ( Updated:2021-01-31 22:52:51.0  )
పర్మిషన్ ఓచోట.. తవ్వేది మరోచోట
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఇసుక క్వారీల ఏర్పాటులో జరుగుతున్న ఈ విధానం ఎక్కడా కనిపించదు.. వినిపించదు.. అత్యంత విచిత్రంగా అధికారులు గత కొన్నేళ్లుగా వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.. కళ్ల ముందే సాక్షాత్కరిస్తున్న ఈ విచిత్రాన్ని ఏళ్లుగా ఇలాగే కొనసాగిస్తున్నారు తప్ప సవరించేందుకు మాత్రం చొరవ తీసుకోవడం లేదు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మీదుగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో అక్రమ ఇసుక రవాణా బాగోతంపై స్థానికులు మండిపడుతున్నారు.

ఆరు క్వారీలు..

సుమారు ఐదేళ్ల క్రితం మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక క్వారీలను ప్రభుత్వం ప్రారంభించింది. మహదేవపూర్ శివారులో ఆరు క్వారీలను ఏర్పాటు చేయగా, రెండు క్వారీలు వేరే గ్రామాల శివార్లలో నడుస్తున్నాయి. రికార్డుల ప్రకారం మహదేవపూర్ పేరిట నడుస్తున్న సీనరేజ్ మాత్రం సంబంధిత గ్రామ పంచాయతీ అకౌంట్లలో జమ చేస్తున్నారు. బ్రాహ్మణపల్లి పేరిట నడుస్తున్న క్వారీలు మహదేవపూర్ శివారులో, బొమ్మాపూర్ క్వారీలు బ్రాహ్మణపల్లి శివారులో నడిపిస్తున్నారు. ఇలా మండలంలోని దిగువ గ్రామాలకు చెందిన క్వారీలను ఎగువ గ్రామంలో నిర్వహిస్తున్నారు.

సీనరేజీ ఫండ్ ఏదీ?

క్వారీలు నిర్వహిస్తున్న గ్రామాలకు సీనరేజీ ఫండ్ అందజేస్తున్న అధికారులు కొన్ని గ్రామాలకు నష్టం కలిగేలా నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బ్రాహ్మణపల్లి, సూరారం గ్రామ పంచాయతీలకు నామమాత్రంగా సీనరేజీ ఫండ్ వస్తోంది. బ్రాహ్మణపల్లి సర్పంచ్ తమ గ్రామానికి రావాల్సిన సీనరేజీ ఫండ్ మరో గ్రామానికి వెళ్తోందని అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్వే కూడా చేయించడంతో బ్రాహ్మణపల్లి శివారులో కూడా ఇసుక తీస్తున్నారని గుర్తించారు. తమ గ్రామానికి కూడా ఫండ్ చెల్లించాలని అధికారులను కోరుతున్నారు. క్వారీల ఏర్పాటు సమయంలో ఇలాంటి లోపాలను గమనించి ఆయా గ్రామాల శివార్లను గుర్తించడంలో సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి తయారైందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఆయా గ్రామాల్లో ఉన్న కూలీలకు ఉపాధి కల్పించే విషయంలో కూడా అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో స్థానికంగా అధికారులు కూలీలకు పనులు అప్పగించే విషయంలో అడ్జెస్ట్‌మెంట్ చేశారు.

విచిత్రంగా ఉంది..

మహదేవ్‌పూర్ మండలంలో ఇసుక క్వారీల శివార్లను మార్చి తరలిస్తున్న తీరు దారుణం. రికార్డుల్లో ఉన్న పంచాయతీలకు సీనరేజీ ఫండ్ రావడం లేదు. జీపీఎస్ సిస్టం ద్వారా పకడ్బందీగా క్వారీలను ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలకు న్యాయం చేయాలి.

-మేసినేని రవీందర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు

Advertisement

Next Story

Most Viewed