యోధుడిలా కనిపిస్తున్న ధోనీ.. గాయాన్ని కూడా లెక్కచేయకుండా..

by Harish |   ( Updated:2024-04-17 12:30:23.0  )
యోధుడిలా కనిపిస్తున్న ధోనీ.. గాయాన్ని కూడా లెక్కచేయకుండా..
X

దిశ, స్పోర్ట్స్ : మహేంద్ర సింగ్ ధోనీ.. అతనో సక్సెఫుల్ కెప్టెన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. అంతేకాకుండా, చెన్నయ్ సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిపాడు. అతనో గొప్ప బ్యాటర్, ఫినిషర్ కూడా. తన ఆటతోనేకాకుండా వ్యక్తిత్వంతో కూడా ధోనీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. అయితే, ఐపీఎల్-17లో అతనో యోధుడిలా కనిపిస్తున్నాడు. కొందరు ఆటగాళ్లు చిన్న చిన్న గాయాలతోనే తర్వాతి మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకోవడాన్ని చూస్తున్నాం. అలాంటిది మోకాలి గాయంతో ధోనీ బరిలోకి దిగుతూ ఆట పట్ల తన నిబద్ధతను చాటుకుంటున్నాడు.

ఈ సీజన్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు చెన్నయ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. యువ ఓపెనర్ గైక్వాడ్‌కు బాధ్యతలు అప్పగించాడు. ఇదే ధోనీకి చివరి సీజన్ అన్న వార్తలు వస్తున్నాయి. దీంతో చెన్నయ్ మ్యాచ్‌లు ఎక్కడ జరిగిన ధోనీని చూసేందుకు అభిమానులు భారీగా హాజరవుతున్నారు. ధోనీ కూడా ఫ్యాన్స్‌ను నిరాశపర్చడం లేదు. క్రీజులో కాసేపే కనిపిస్తున్నా ఫినిషర్‌ రోల్‌లో అదగొడుతున్నాడు. వైజాగ్‌లో ఢిల్లీతో మ్యాచ్‌లో చెన్నయ్ ఓడినా.. ధోనీ ఆటకు మాత్రం అభిమానులు ఫిదా అయ్యారు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆదివారం ముంబైతో మ్యాచ్‌లోనూ అతను ఎదుర్కొన్న నాలుగు బంతుల్లో మూడింటిని స్టాండ్స్‌లోకి పంపించాడు. చివరి ఓవర్‌లో అతను చేసిన 20 పరుగులే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి కూడా. అయితే, ధోనీకి ఇది ఒకవైపే. మరోవైపు, అతను మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. గత సీజన్‌లో మోకాలి గాయంతోనే బాధపడిన అతను.. సీజన్ తర్వాత గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. ఈ సీజన్‌లో మోకాలి గాయం తిరగబెట్టింది. వైజాగ్ మ్యాచ్‌ అనంతరం మోకాలికి ఐస్ ప్యాక్ ధరించాడు. మిగతా మ్యాచ్‌ల్లోనూ కీపింగ్ చేసేటప్పుడు అతను కుంటుతూ కనిపించాడు. తాజాగా చెన్నయ్ బౌలింగ్ కోచ్ ఎరికి సిమ్మన్స్ మాట్లాడుతూ.. ధోనీ మోకాలికి గాయమైందని, నొప్పి కనిపించకుండా అతను ధైర్యంగా పోరాడుతున్నాడని వ్యాఖ్యానించాడు.

చివరి సీజన్‌ సంకేతమా?..

ధోనీ ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు ఎక్కువయ్యాయి. దీనిపై ధోనీగానీ, చెన్నయ్ మేనేజ్‌మెంట్‌గానీ అధికారికంగా స్పందించకపోయినా.. క్రీడా విశ్లేషకులు మాత్రం అవుననే అంటున్నారు. అందుకే, అతను కెప్టెన్సీ నుంచి తప్పకున్నాడని, దానికితోడు ధోనీ గాయాన్ని కూడా లెక్కచేయకుండా ఆడుతుండటం చివరి సీజన్ సంకేతమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, గాయంతో ధోనీ ఈ సీజన్ మొత్తం ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. గతంలో చెన్నయ్‌లోనే ఆటకు వీడ్కోలు పలుకుతానని ధోనీ చెప్పాడు. ఈ సీజన్‌లో మే 12న రాజస్థాన్‌తో సీఎస్కే చివరి గ్రూపు మ్యాచ్ ఆడనుంది. మే 24న క్వాలిఫయర్ 2కు, 26న ఫైనల్‌కు చెన్నయ్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. రిటైర్మెంట్ వార్తలు నిజమైతే ధోనీ ఈ మూడు మ్యాచ్‌ల్లో ఏదో ఒకటి అతనికి చివరిది కానుంది.

Advertisement

Next Story