ఐపీఎల్.. సరిలేరు నీకెవ్వరు

by Shiva |
ఐపీఎల్.. సరిలేరు నీకెవ్వరు
X

దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాల్లో ప్రస్తుతం టీ20 లీగ్స్‌దే హవా. ఇండియాలో ఐపీఎల్, ఆస్ట్రేలియాలో బీబీఎల్, పాకిస్తాన్‌లో పీఎస్ఎల్, వెస్టిండీస్‌లో సీపీఎల్ ఇలా చాలా లీగ్స్ ఉన్నాయి. ఎన్ని లీగ్స్ ఉన్నా మరిన్ని వచ్చినా వస్తున్నా ఐపీఎల్‌కు ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఈ లీగ్ నిర్వహణలో బీసీసీఐ పాటిస్తున్న కొన్ని నియమాలే ఇందుకు ముఖ్య కారణం. రూ.50 వేల కోట్ల నికర విలువ కలిగిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ మినహా ప్రపంచంలో మరేదీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఏడాది లీగ్ ఫార్మాట్ మార్చకపోవడం, సాధ్యమైనంత నిడివిని పెంచకుండా చూడటంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ఆటను నడిపించడం ఐపీఎల్ సక్సెస్‌కు ముఖ్య కారణం. ఇక ఇండియన్ క్రికెటర్లు ఐపీఎల్‌లో తప్ప మరే ఇతర లీగ్స్‌లో కూడా కనిపించకుండా చూడటానికి బీసీసీఐ కఠిన నిబంధనలను విధించింది. దీంతో దేశవాళీ క్రికెటర్ల నుంచి ప్రస్తుతం టీంఇండియాలో ఆడుతున్నవాళ్లు ఇటీవల రిటైరైన ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో ఉండాలంటే ఇతర లీగ్స్ జోలికి వెళ్లకుండా ఉండాల్సిందే. క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉండే ఇండియాలో ఇతర లీగ్స్‌కు ఆదరణ అంతంత మాత్రమే. కారణం వాటిలో ఒక్క ఇండియన్ ప్లేయర్ కూడా కనిపించకపోవడం. మరోవైపు విదేశీ ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌కు ఇచ్చిన ప్రాముఖ్యం ఇతర లీగ్స్‌కు ఇవ్వరు. ముఖ్యంగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్‌కు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అందుకే 2008లో ప్రారంభమైన ఈ లీగ్ ఇంకా ప్రేక్షకుల ఆదరణ కోల్పోకుండా కొనసాగుతూనే ఉంది.

ఇండియాలో ఐపీఎల్ హిట్ కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా కూడా లీగ్ ప్రారంభించింది. బిగ్ బాష్ (బీబీఎల్) పేరుతో 2011లో ప్రారంభించిన ఈ లీగ్ తక్కువ సమయంలోనే అందరినీ ఆకట్టుకుంది. అయితే, రానురానూ ఈ లీగ్‌లో క్రికెట్ కంటే ఇతర విషయాలకే ప్రాధాన్యం ఇవ్వడం ప్రేక్షకులను నిరశపరుస్తోంది. గ్రౌండ్‌లో ప్లేయర్లకు మైకులు పెట్టి మాట్లాడించడం, తరుచూ ఫ్రాంచైజీలను మార్చడం, సుదీర్ఘంగా మ్యాచ్‌లు కొనసాగడం ఈ లీగ్‌కు మైనస్‌లుగా మారాయి. 2015-16 సీజన్‌లో సగటును ఒక్కో మ్యాచ్‌కు 29 వేల మంది ప్రేక్షకులు హాజరవ్వగా ఈ ఏడాదికి 18 వేలకు పడిపోయిందంటే బీబీఎల్ ఆదరణ ఎంత వేగంగా దిగజారిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ ప్లేయర్లు లేకున్నా ఆకట్టుకున్న బీబీఎల్ ఇప్పుడు నిర్జీవంగా మారిపోయింది. ప్రస్తుతం ఆ లీగ్‌లో ఆడిన ఆటగాళ్లే పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా కనిపిస్తుండటంతో అది ఆ దేశానికి ప్లస్‌గా మారింది. 2016లో ప్రారంభించిన పీఎస్ఎల్ దుబాయిలోనే కొనసాగింది. వెస్టిండీస్ ఆటగాళ్లే ఎక్కువగా ఈ లీగ్‌లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది పాకిస్తాన్‌లోనే కొన్ని మ్యాచులు జరిగినా కరోనా కారణంగా చివర్‌లో లీగ్ అర్ధాతంరంగా వాయిదా పడింది. అయినా సరే పాకిస్తాన్ క్రికెట్‌ లీగ్‌కు అటు గ్రౌండ్‌లో ఇటు టీవీల్లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోతోంది. వచ్చే ఏడాది మరింత గ్రాండ్‌గా పీఎస్ఎల్‌ను నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఐపీఎల్, బీబీఎల్‌లకు వస్తున్న ఆదరణ, ఆదాయం చూసి వెస్టిండీస్ క్రికెట్ కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీసీఎల్‌)ను ప్రారంభించింది. సీపీఎల్‌కు అక్కడ చక్కని ఆదరణ లభిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తున్న లీగ్స్ కూడా మంచి ఆదాయాన్ని ఆర్జించడంతో ఈసీబీ ఈ ఏడాది నుంచి ‘ది హండ్రెడ్’ పేరుతో 100 బంతుల క్రికెట్‌ను ప్రారంభించాలని భావించింది. కానీ, కరోనా వైరస్ కారణంగా వచ్చే ఏడాదికి ఈ లీగ్ వాయిదా పడింది. ఈ లీగ్సే కాకుండా న్యూజిలాండ్‌లో టీ20 బ్లాస్ట్, బంగ్లాదేశ్‌లో బీపీఎల్, శ్రీలంకలో ఎల్‌పీఎల్‌లు ఉన్నాయి. ఎన్ని క్రికెట్ లీగ్స్ వచ్చినా టాప్ రేటెడ్ లీగ్‌గా మాత్రం ఐపీఎల్ కొనసాగుతుండటం విశేషం. ఈ ఏడాది ఐపీఎల్ రద్దయితే దాని బ్రాండ్ వాల్యూ కాస్త తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, ప్రేక్షకుల ఆదరణ మాత్రం తగ్గకపోవచ్చని అంటున్నారు.

Advertisement

Next Story