- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌లో ఆటగాళ్ల బదిలీలు.. ఏ ఆటగాడు ఏ జట్టులోకి..?
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు సరైన ఆటగాళ్లు లేక ఇబ్బంది పడుతున్నాయి. హైదరాబాద్ జట్టుకు సరైన ఫినిషర్ లేకపోవడంతో వరుసగా మ్యాచ్‌లు కోల్పోతూ వస్తున్నది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉన్నది. ఈ సీజన్‌లో ఆటగాళ్లు లేక ఎక్కువగా ఇబ్బంది పడుతున్న జట్టు రాజస్థాన్ రాయల్స్. సీజన్ ప్రారంభానికి ముందే జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా వైదొలిగాడు. బెన్‌స్టోక్స్ తొలి మ్యాచ్‌లోనే గాయపడి ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. లియామ్ లివింగ్‌స్టన్, ఆండ్రూ టై కరోనా భయాందోళనలతో ఇంటిబాట పట్టారు. దీంతో రాజస్థాన్ జట్టు తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. కీలకమైన నలుగురు విదేశీ ఆటగాళ్లు ఈ జట్టులో లేరు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయాలు సాధిస్తున్నా.. సరైన పేసర్ లేకపోవడం స్పష్టంగా తెలుస్తున్నది. అడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ ఆస్ట్రేలియా తిరిగి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఆ జట్టు మరో కీలక బౌలర్ కోసం అన్వేషణ మొదలు పెట్టింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మిడ్-సీజన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఇతర జట్లలో ఖాళీగా ఉన్న క్రికెటర్లను తీసుకోవాలని పలు ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి.
ఏమిటీ మిడ్-సీజన్ ట్రాన్స్‌ఫర్
ఐపీఎల్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఏ ఫ్రాంచైజీ అయినా ఆటగాళ్లను అరువుగా తెచ్చుకోవచ్చు. ఇందుకు బీసీసీఐ కొన్ని నిబంధనలు రూపొందించింది. ఏ ఆటగాడినైనా బదిలీ చేయాలంటే ప్రస్తుతం జరుగుతున్న సీజన్‌లో ఆ ఆటగాడు మూడు మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడి ఉండకూడదు. తుది జట్టులో ఉండటమే కాకుండా కంకషన్ ప్లేయర్‌గా ఆడిన దాన్ని కూడా ఒక మ్యాచ్‌గా పరిగణస్తారు. ఒక సారి ఆటగాడు బదిలీ జరిగిన తర్వాత మిగిలిన సీజన్ మొత్తం అప్పు తీసుకున్న జట్టు తరపునే ఐపీఎల్ ఆడాల్సి ఉంటుంది.
అంతే కాకుండా మిగిలిన సీజన్‌లో ఎప్పుడైనా తన సొంత జట్టుతో అప్పు తీసుకున్న జట్టు తలపడితే ఆ మ్యాచ్‌లో బదిలీ అయిన ఆటగాడు ఆడటానికి వీలు లేదు. చివరకు బదిలీ తీసుకున్న, ఇచ్చిన జట్టు ఫైనల్స్ చేరినా.. సదరు ఆటగాడికి మాత్రం మ్యాచ్ ఆడటానికి ఛాన్స్ ఉండదు. ఇక ఆటగాడు బదిలీ అయినా అతడి జీతం మాత్రం సొంత ఫ్రాంచైజీ మాత్రమే చెల్లిస్తుంది. అప్పుగా తీసుకున్న జట్టు మాత్రం మ్యాచ్‌కు కొంత మొత్తం ఫీజుగా చెల్లిస్తుంది. ఒక సీజన్‌లో ఒక జట్టు ముగ్గురు ఆటగాళ్ల కంటే ఎక్కువ మందిని ఒకే జట్టుకు అప్పుగా ఇవ్వడానికి వీలు లేదు. ఈ నిబంధనలు అన్నీ పాటిస్తూ ఆటగాళ్ల బదిలీ జరుగుతుంది.
ఈ సారి ఎవరి బదిలీ జరగొచ్చు?
ఐపీఎల్‌లో మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ ఏప్రిల్ 26 రాత్రి 9.00 గంటలకు ప్రారంభమైంది. మే నెల 23 రాత్రి 9 గంటల వరకు ఈ ట్రాన్స్‌ఫర్ విండో అందుబాటులో ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సారి సరైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మాన్ లేక ఇబ్బంది పడుతున్నది. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన రాబిన్ ఊతప్పను ఆ జట్టు అప్పుగా అడిగే అవకాశం ఉన్నది. కాగా, ఈ సీజన్‌కు ముందే రాజస్థాన్ జట్టు ఊతప్పను ట్రేడ్ ద్వారా చెన్నైకి అమ్మడం గమనార్హం. హైదరాబాద్ జట్టు బెంచ్‌పై ఉన్న జేసన్ రాయ్‌ని కూడా రాజస్థాన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన టామ్ కర్రన్, సామ్ బిల్లింగ్స్, అజింక్య రహానేలపై కూడా ఇతర జట్లు కన్నేశాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లాకీ ఫెర్గూసన్, పోరెల్‌ను తీసుకునే అవకాశం ఉన్నది. మరోవైపు సన్‌రైజర్స్ మిడిల్ ఆర్డర్ పటిష్టం చేయడానికి ఈ సీజన్‌కు రహానేను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. పంజాబ్ కింగ్స్ కూడా జేమ్స్ నీషమ్‌ను తీసుకొని బౌలింగ్‌ను పటిష్టం చేయాలని భావిస్తున్నది. కాగా, అప్పుగా ఇవ్వాలని ఆయా ఫ్రాంచైజీలు కోరినా ఆటగాడిని బదిలీ చేయడం పూర్తిగా సొంత ఫ్రాంచైజీ ఇష్టమే. దీంతో ఏయే జట్లు తమ ఆటగాళ్లను అప్పుగా ఇస్తాయో అనే దానిపై సందిగ్దత నెలకొన్నది.