జగన్, విజయసాయిరెడ్డిలపై ఫిర్యాదులను పరిశీలించండి

by srinivas |
raghurama krishnam raju,
X

దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు… సీఎం వైఎస్ జగన్-విజయసాయిరెడ్డిల మధ్య నెలకొన్నపోరు తారా స్థాయికి చేరింది. ఎంపీ రఘరామ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు విజయసాయరెడ్డితోపాటు పలువురు వైసీపీ ఎంపీలు పలుమార్లు ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణంరాజు బ్యాంకులను మోసం చేశారని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణంరాజు దేశం విడిచి వెళ్లకుండా చూడాలని కోరారు. అంతేకాదు అతడిని విచారించాలని లేఖలో డిమాండ్ చేశారు.

ఈ అంశంపై ఆదివారం విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ రఘురామపై తాను చేసిన ఫిర్యాదుకు కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తన ఫిర్యాదులపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై చిర్రెత్తుకొచ్చిన ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం అక్రమాస్తుల కేసులో సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తాను రాసిన లేఖలపై కూడా స్పందన వచ్చిందని తెలిపారు. జగన్, విజయసాయిరెడ్డిల ఆర్థిక అక్రమాలు, సీబీఐ కోర్టులో పెండింగులో ఉన్న ఛార్జ్ షీట్లపై తాను చేసిన ఫిర్యాదుకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి బదులు వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ అంశాన్ని సంబంధిత శాఖలకు పంపినట్టు అధికారికంగా లేఖ వచ్చిందని చెప్తూ ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు.

‘గౌరవ రాష్ట్రపతికి జగన్, విజయసాయిరెడ్డిల ఆర్థిక అక్రమాలు, వారిపై సీబీఐ కోర్టులో ఉన్న పెండింగ్ ఛార్జ్ షీట్లపై నేను పంపిన పూర్తి నివేదికను పరిశీలించాలని సంబంధిత శాఖలకు పంపించారు’ అని ఆయన పేర్కొన్నారు. మెుత్తానికి రఘురామకృష్ణంరాజు లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంటే.. అందుకు ప్రతిగా సీఎం జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులను ఆశ్రయిస్తున్నారు రఘురామ.

బ్యాంకులను మోసం చేశారని ప్రధాని, రాష్ట్రపతి, కేంద్రఆర్థిక మంత్రులకు లేఖలు రాస్తే జగన్, విజయాసాయిరెడ్డి ఆర్థిక అక్రమాలు, సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్న చార్జ్ షీట్లపై లేఖలు రాస్తున్నారు. ఇలా ఇరువురు నేతలు తగ్గడం లేదు. నువ్వు తగ్గేవరకు నేను తగ్గను అన్నట్లు ఇరువురు వ్యవహరిస్తున్నారు. మెుత్తానికి వైసీపీ అధిష్టానానికి, రఘురామకృష్ణంరాజుల మధ్య నెలకొన్న వివాదం ఇంకెంత వరకు వెళ్తుందోనని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed