ఈటల రాజేందర్‌ను అప్పుడే టార్గెట్ చేశారా..?

by Anukaran |   ( Updated:2021-05-03 01:41:40.0  )
ఈటల రాజేందర్‌ను అప్పుడే టార్గెట్ చేశారా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించినప్పుడే అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరించిందా అన్న చర్చ మొదలైంది. 2018 ఎన్నికల తరువాత కేబినెట్‌లో ఈటల రాజేందర్‌కు అవకాశం కల్పించేది లేదన్న సంకేతాలను అధినేత పంపించారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఈటల అధిష్టానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీనియర్ నేత వినోద్ కుమార్ ఈటలను సముదాయించేందుకు పలుమార్లు హుజురాబాద్‎కు వచ్చి వెళ్లారు. అయినా ఆయన ససేమిరా అని తనకు కీలకమైన మంత్రిత్వ బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఇదే విషయాన్ని వినోద్ కుమార్ అధినేత దృష్టికి తీసుకెళ్లారు.

అప్పటికే ఈటల రాజేందర్‌కు రెండోసారి కేబినెట్‌లో అవకాశం దక్కదన్న ప్రచారం విస్తృతంగా సాగింది. ఆయనకు ప్రత్యామ్నాయంగా కరీంనగర్ జిల్లా నుండే ప్రాతినిథ్యం వహిస్తున్న గుంగల కమలాకర్ పేరును అధిష్టానం పరిశీలించింది. దీంతో బీసీని బీసీతోనే చెక్ పెట్టే యోచనలో అధిష్టానం ఉందని స్పష్టం అయింది. ఇదే అంశం గురించి ఈటల వర్గంలోనూ ఇప్పుడు చర్చ సాగుతోంది. అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరించి బీసీ సామాజిక వర్గానికి చెందిన గంగులకు అవకాశం కల్పించడంతో అన్ని సమన్యాయం పాటించినట్టవుతుందని భావించి ఉండవచ్చని అనుకుంటున్నారు. అంతేకాకుండా బీసీల్లో బలమైన సామాజిక వర్గం కూడా కావడంతో ఈటలకు అవకాశం దక్కకుండా చేసేందుకే అధిష్టానం ఈ ఎత్తుగడ వేసి ఉంటుందని భావిస్తున్నారు.

ఆ డైలాగ్ అనకుంటే..?

ఈటెల రెండో సారి కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయన గులాబి జెండాకు ఓనర్లం అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనకు అధిష్టానానికి ఏర్పడిన గ్యాప్ కొంతమేర తగ్గింది. అప్పటి వరకు కేబినెట్ సభ్యుడే అయినప్పటికీ అధినేత కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి కొంత గ్యాప్ ఉండడం, వేరే మంత్రులకు ప్రాధాన్యం ఇవ్వడం తట్టుకోలేక వ్యాఖ్యానించారన్న ప్రచారం జరిగింది. ఈటల చేసిన ఈ వ్యాఖ్యల తరువాత అప్పుడే అదిష్టానం ఆయనపై వేటు వేసే ఆలోచనను తనలోనే దాచుకుందన్న వ్యాఖ్యలు వినిపించాయి.

అచ్చి రాని శాఖ అందుకేనా

తెలంగాణ ఆవిర్భావం తరువాత ఈటలకు వైద్య ఆరోగ్య శాఖ ఇవ్వడం వెనక కూడా వ్యూహం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈటల అభిమానులు. అప్పటికే తాటికొండ రాజయ్య, లక్ష్మారెడ్డిలకు కలిసి రాని ఈ శాఖను ఈటలకు ఇవ్వడం వల్ల ఆయన సెల్ఫ్ గోల్ అవుతారని అధిష్టానం భావించి ఉంటుందని అంటున్నారు. అయితే, కరోనా కష్టకాలంలో కూడా ఈటల ధైర్యంగా ముందుకు సాగడంతో ఆయనను తప్పు పట్టలేని పరిస్థితి అధిష్టానానికి ఎదురైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చివరకు భూముల వ్యవహారంలో ఆయనను టార్గెట్ చేసిన అధిష్టానం వైద్య ఆరోగ్య శాఖ కలిసి రాలేదన్న సెంటిమెంట్‌ను కంటిన్యూ చేసేలా వ్యవహరించిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed