ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ కట్

by Shyam |
ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ కట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు గురువారం జారీచేసింది. నిబంధనల ప్రకారం ఎంసెట్ ద్వారా సీటు పొందాలంటే విద్యార్థులు ఎంసెట్‌లో అర్హత సాధించడంతో పాటు ఇంటర్‌లో 45శాతం మార్కులు సాధించి ఉండాలి. అయితే కరోనా వైరస్‌ కారణంగా ఇంటర్‌ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం పరీక్షలు లేకుండానే 35 % మార్కులతో ఇంటర్ ఫలితాలు విడుదల చేసింది.

ఈ నేపథ్యంలో ఎంసెట్‌లో అర్హత కోల్పోయి ఇంజనీరింగ్, మెడిసిన్ స్టడీస్‌‌కు దూరమవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కులను తొలగించాలని పిటీషన్‌లో కోరారు. పిటీషన్‌పై స్పందించిన న్యాయస్థానం ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇంటర్ వెయిటేజీని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌ నిబంధనలను సవరిస్తూ గురవారం జీఓను విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్‌లో మార్కులు తక్కువ వచ్చినా.. ఎంసెట్ ర్యాంకు సాధించిన విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఇంటర్ పాసైన అందరు విద్యార్థులు ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు వెసులుబాటు కలుగుతోంది.

ఈ ఏడాది ఇంటర్మీడియట్ సెకండియర్‌ పరీక్షలకు మొత్తం 4.11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు 2,83,631 మంది ఉన్నారు. ఇందులో 1.75లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. కరోనా నేపథ్యంలో మిగిలిన వారిని కూడా పాస్ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఎంసెట్ వెయిటేజీ నిబంధనల్లో మార్పులు చేయకపోవడంతో ఎంసెట్ ర్యాంకు వచ్చినా సీటు కోల్పోతున్నామని విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. కోర్టు తీర్పు, ప్రభుత్వ ఆదేశాలతో ఎంసెట్ ప్రవేశాలకు విద్యార్థులకు అవకాశం కలుగుతోంది. పాసయిన అందరు విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉండటంతో మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే సీట్ల కేటాయింపు పెరగనుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని గురువారం నుంచి జరగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను కూడా నిలిపివేశారు.

Advertisement

Next Story

Most Viewed