మారని అధికారుల తీరు.. రెండోసారి జాతీయ జెండాకు అవమానం

by Anukaran |
మారని అధికారుల తీరు.. రెండోసారి జాతీయ జెండాకు అవమానం
X

దిశ, వికారాబాద్ : 75వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించుటకు ముందస్తు పక్కా ప్రణాళికను రూపొందించుకుంటారు. జాతీయ జెండా ఆవిష్కరణలో ఎలాంటి తప్పులు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరణలో జాతీయ జెండాను తిరగవేసి ఎగురవేయడంతో తీవ్ర అవమానం జరిగింది. గ్రంథాలయ సంస్థ అధికారులు, గ్రంథాలయం సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమక్షంలో జాతీయ జెండాకు రెండవసారి తీవ్ర అవమానం జరగడంతో ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. గత సంవత్సరం జ్ఞానాన్ని అందించే జ్ఞాన భాండాగార ఆలయంలో జాతీయ జెండాను తిరగవేసి ఎగురవేసినందుకు విద్వత్ సంపన్నులచే మొట్టికాయలు వేయించుకున్నారు.

ఈ సంవత్సరమైనా జాతీయ జెండా ఆవిష్కరణలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారా అంటే అది లేదు. జాగ్రత్తలు తీసుకొనుటలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు గ్రంథాలయ సిబ్బంది. అధికారుల నిఘా పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది తమకు తోచిన విధంగా వ్యవహరించడం వలన పతాకావిష్కరణ తిరగబడింది. త్వరలో చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకారం చేపట్టబోయే ముందు జాతీయ పతాక ఆవిష్కరణలో జరిగిన తప్పిదం ఒక చేదు జ్ఞాపకంగా చైర్మన్‌కు మిగిలిపోనున్నది. గ్రంథాలయం సిబ్బందికి జీతాలపై ఉన్న శ్రద్ధ జాతీయ జెండాను ఎగురవేయడంలో, తగు జాగ్రత్తలు తీసుకోవడంలో లేదని విద్యావంతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ జెండాను సరిచేసే క్రమంలో గ్రంథాలయ సిబ్బంది తమ కాళ్ళ దగ్గర వేసుకోవడం తీవ్ర విమర్శలకు మూలకారణమయ్యింది. భవిష్యత్తులో జాతీయ పతాకాష్కరణలో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తారని ఆశిద్దాం. అనంతరం జాతీయ పతాకావిష్కరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రంథాలయ అధికారులకు చైర్మన్ మురళి కృష్ణ గౌడ్ నోటీసు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed