కరోనా నివారణకు జీహెచ్ఎంసీకి సూచనలు

by vinod kumar |
కరోనా నివారణకు జీహెచ్ఎంసీకి సూచనలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నివారణకు చేపడుతున్న చర్యలపై జీహెచ్ఎంసీ అధికారులకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ సూచనలు చేశారు. ఒక పాజిటివ్ కేసు గుర్తించిన ప్రాంతాన్ని సైతం కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రభుత్వం ప్రకటిస్తున్నందున బారికేడ్లు, ఇతర చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్లలో చేపట్టిన పనులపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అదనపు కమిషనర్ బి. సంతోష్, సీసీపీ దేవేందర్ రెడ్డిలతో కలిసి గురువారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో చర్చించారు. సర్వే టీమ్స్, అనుమానిత కేసులకు ప్రాథమిక నిర్థారణ పరీక్షలు జరిపేందుకు తీసుకుంటున్న చర్యలపై వాకబు చేసి, నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. కంటైన్మెంట్ జోన్లలో నియమించిన నోడల్ టీమ్, సర్వే టీమ్స్ రోజువారీగా నిర్వహిస్తున్న విధులను మానిటరింగ్ చేయాలన్నారు. పారిశుధ్య కార్మికులు, సర్వే టీమ్స్, రసాయనాలను స్ప్రే చేస్తున్న టీమ్స్‌కు రక్షణ పరికరాలు అందజేశామని, అదేవిధంగా అన్ని విభాగాల నోడల్ అధికారులతో రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తున్నట్లు కమిషనర్‌ లోకేష్ కుమార్ వివరించారు. ప్రభుత్వ చర్యలు, కంటైన్మెంట్ జోన్ల ఉద్దేశ్యం, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తూ తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో కరపత్రాలు ముద్రించి ఇంటింటికి పంపిణీ చేసినట్లు తెలిపారు.

Tags: Corona Virus, Positive, Containment Zone, References to GHMC, Arvind Kumar, Lokesh Kumar, Pamphlets

Advertisement

Next Story