ఒంటికాలితో కశ్మీర్ టు కన్యాకుమారి.. యువతి సైకిల్ యాత్ర

by Shyam |
ఒంటికాలితో కశ్మీర్ టు కన్యాకుమారి.. యువతి సైకిల్ యాత్ర
X

దిశ, వెబ్‌డెస్క్ : కశ్మీర్ నుంచి కన్యాకుమారి(k2k) సైకిల్ యాత్ర చేయడమే ఓ సాహసం అయితే, ఒంటి కాలుతో ఆ జర్నీని కంప్లీట్ చేయడం నిజంగా అద్భుతం. నూరేళ్ల జీవితాన్ని ఒంటి కాలుతోనే లీడ్ చేస్తున్న మధ్యప్రదేశ్ అమ్మాయి తాన్య దగాకు 3,800 కిలోమీటర్ల దూరం చెరిపేయడం ఓ లెక్క. అంతేకాదు ప్రయాణం మధ్యలో ఆమె తన తండ్రి చనిపోయాడనే వార్త తెలియగా, ఆ బాధను దిగమింగుకుని వైకల్యాన్ని వెక్కరిస్తూ, విధిని ధిక్కరిస్తూ సైకిల్ సవారి చేసిన ఆ యోధురాలి ఎపిక్ జర్నీ విశేషాలు మీకోసం..

ఫిజికల్ చాలెంజెస్‌ను అధిగమించడమే కాకుండా తన తండ్రి మరణంతో వ్యక్తిగత నష్టాన్ని కూడా ఎదుర్కొంది పారా అథ్లెట్ తాన్య. ఎన్ని కష్టాలెదురైనా తన గమ్యాన్ని చేరి విజయం సాధించిన తాన్య ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలుస్తోంది. దేశ వ్యాప్తంగా శారీరకంగా వికలాంగులైన విద్యార్థులకు పారా స్పోర్ట్స్‌పై అవగాహన కల్పించడంతో పాటు, వారి కోసం విరాళాలు సేకరించడం ‘ఇన్ఫినిటీ రైడ్‌’ లక్ష్యం కాగా, బిఎస్‌ఎఫ్‌ సహకారంతో ఆదిత్య మెహతా ఫౌండేషన్‌ ఈ రైడ్‌ను ఏటా నిర్వహిస్తోంది.

‘రెండేళ్ల క్రితం ఓ రొడ్డు ప్రమాదంలో నా కాలు కోల్పోయాను. ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఆ సమయంలో నా జీవితం కోల్పోయిన భావన కలిగినా, నాన్న నా వెన్నంటి నిలిచి నాకు ధైర్యాన్ని అందించాడు. శరీరంలో ఓ భాగం కోల్పోయినంత మాత్రాన మన జీవితం అక్కడితో ఆగిపోదని, మన లక్ష్యం కోసం శ్రమించాలని నాన్న చెప్పిన మాటలే నాకు మరో జీవితాన్నిచ్చాయి. ఆ ప్రోత్సాహంతోనే పారా అథ్లెట్‌గా నన్ను నేను నిరూపించుకుంటున్నాను. ఈ క్రమంలో 2020 నవంబర్ 19న కశ్మీర్ టు కన్యాకుమారి యాత్రకు మా టీమ్ అంతా బయలుదేరాం, అయితే విధి నన్ను మరోసారి పరీక్షించాలనుకుంది. డిసెంబర్ 18న నాన్న చనిపోయాడనే వార్త తెలిసినప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాను. నన్ను ఎంతో ప్రొత్సహించి, నన్ను ఓ ఫైటర్‌గా తీర్చిదిద్దిన నాన్న లేడని తెలియడంతో ఒక్కసారిగా ప్రపంచమంతా అంధకారమైంది. వెంటనే మధ్యప్రదేశ్ వెళ్లి నాన్నను చూసి వచ్చి మళ్లీ నా యాత్రలో భాగమయ్యాను. ఈ మిషన్ కంప్లీట్ చేయాలన్నది నాన్న కోరిక. ఆయన లేకపోయినా, తన స్ఫూర్తితో నా లక్ష్యాన్ని పూర్తి చేసి తన కోరికను తీర్చాను’ అని తాన్య తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది. మనదేశం నుంచి ఏకైక ఫిమేల్ పారా సైక్లిస్ట్ ‘తాన్య’ కావడం విశేషం. నెటిజన్లు తాన్యను ‘సూపర్ ఉమన్’‌గా, ‘అచీవర్’గా అభివర్ణిస్తూ, అభినందనలు అందిస్తున్నారు. పారా సైక్లిస్ట్‌గా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని, ఎవరైనా ఏదైనా సాధించడానికి అర్హులేనని, ఎవరూ ఎవరికీ తీసిపోరనే అవగాహన దివ్యాంగుల్లో కల్పిస్తానని తాన్య తెలిపింది.

Advertisement

Next Story