50 రోజుల లాక్‌డౌన్..ఆర్థిక ప్యాకేజీ కోరుతున్న పరిశ్రమల సమాఖ్య!

by Shyam |
50 రోజుల లాక్‌డౌన్..ఆర్థిక ప్యాకేజీ కోరుతున్న పరిశ్రమల సమాఖ్య!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రం రూ.15 లక్షల కోట్ల తక్షణ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కోరింది. భారత ఆర్థిక వ్యవస్థను కరోనా వ్యాప్తి తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొంది. ఈ క్రమంలోనే జీడీపీలో 7.5 శాతానికి సమానమైన ప్యాకేజీని లేదా రూ.15 లక్షల కోట్లు ప్రకటించాలని పేర్కొంది. వైరస్ ప్రభావం రానున్న 12 నెలల నుంచి 18 నెలల వరకు కొనసాగనుందని వెల్లడించింది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని పరిశ్రమలకు, పేదలకు తక్షణమే ప్రభుత్వం నుంచి తక్షణ మద్దతు అవసరమని అభిప్రాయపడింది.

50 రోజుల లాక్‌డౌన్..

గత 50 రోజులుగా ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయాయని, అంచనాలకు మించి ఆర్థిక వ్యవస్థపై మరింత భారం ఉండే ప్రమాదముందని, దీన్ని అధిగమించడానికి భారీ ఆర్థిక ప్యాకేజీ అవసరమని సీఐఐ అభిప్రాయపడింది. ఉద్యోగాలను, జీవనోపాధిని కాపాడటానికి భారీ ప్యాకేజీ అవసరమని తెలిపింది. ప్రభుత్వం జన్ ధన్ అకౌంట్స్‌కు రూ. 2 లక్షల కోట్ల నగదు బదిలీ రూపంలో అందించడం ఇందులో భాగమేనని పేర్కొంది.

ప్యాకేజీ కోసం..

కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ పరిస్థితుల నుంచి కోలుకోవడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుందని సీఐఐ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ బాండ్‌లను ఆర్‌బీఐకి విక్రయించడం ద్వారా రూ.2 లక్షల కోట్లు, సెకండరీ మార్కెట్ నుంచి రూ.2 లక్షల కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మరో రూ.4లక్షల కోట్ల వరకు సర్దుబాటు చేసుకోవచ్చని తెలిపింది.

సీఐఐతో పాటు మిగిలిన ఇతర ఇండస్ట్రీ అసోసియేషన్స్ కూడా కేంద్రం నుంచి భారీ ఆర్థిక ప్యాకేజీని ఆశిస్తున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండియా(ఫిక్కి) రూ. 10 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని కోరింది. పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సైతం రూ. 16 లక్షల కోట్ల ప్యాకేజీని డిమాండ్ చేసింది. అసోచాం రూ. 14 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతోంది.

Advertisement

Next Story