మౌలిక సదుపాయాల అమలు కొనసాగించే చర్యలు అవసరం : ఫిక్కి

by Harish |
మౌలిక సదుపాయాల అమలు కొనసాగించే చర్యలు అవసరం : ఫిక్కి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న మౌలిక సదుపాయాల అమలు ప్రణాళికలు కొనసాగించే చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థికవ్యవస్థ రికవరీ వేగంగా ఉంటుందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కి అధ్యక్షురాలు సంగీతా రెడ్డి చెప్పారు. కొవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వం సరైన వ్యూహాలతో మెరుగైన ఫలితాలను సాధిస్తున్నట్టు ఆమె చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థ తొందరగానే పునరుద్ధరణ సాధించే అవకాశాలున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, ప్రస్తుత పరిస్థితుల అనుగుణంగా మరింత కఠినమైన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా వృద్ధికి మరింత ఊతమివ్వాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నారు.

కొవిడ్-19 వ్యాప్తి మొదలైనప్పుడు విధించిన కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు మంచి ఫలితాలను ఇచ్చినట్టు ఆమె తెలిపారు. అలాగే, సంక్షోభం కారణంగా డీలాపడిన తయారీ, సేవల రంగాలు తక్కువ వ్యవధిలో కోలుకున్నాయని, ఈ-వే బిల్లుల పురోగతి, సరుకుల రవాణాలో ఆదాయం మెరుగ్గా ఉండటం, ఎగుమతుల్లో సానుకూలమైన వృద్ధి కనిపిస్తుండటం, మరీ ముఖ్యంగా సెప్టెంబర్ జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడం ఆర్థికవ్యవస్థ పురోగతికి సంకేతాలుగా భావించవచ్చని సంగీతా రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న మౌలిక సదుపాయాల ప్రణాళికలను కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మంచిన ఆమె సూచించారు.

Advertisement

Next Story

Most Viewed