దేశంలో భారీగా పెరిగిన ఇంధన డిమాండ్..

by Harish |
దేశంలో భారీగా పెరిగిన ఇంధన డిమాండ్..
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి సంబంధిత ఆంక్షలను సడలించడం, ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడంతో దేశీయంగా పెట్రోల్ వినియోగం కొవిడ్ ముందు స్థాయికి చేరుకుందని, మొత్తంగా భారత్‌లో ఇంధన డిమాండ్ పెరిగిందని ప్రాథమిక అమ్మకాల డేటా చెబుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు జులైలో 23.7 లక్షల టన్నుల పెట్రోల్‌ను విక్రయించారు. గతేడాది కంటే ఇది 17 శాతం అధికం.

అలాగే, కరోనాకు ముందునాటి స్థాయితో పోలిస్తే 3.56 శాతం అధికం. డీజిల్ అమ్మకాలు సైతం 12.36 శాతం పెరిగి 54.5 లక్షల టన్నులకు పెరిగాయి. కరోనా ముందు నాటి 2019, జులైతో పోలిస్తే ఇది 10.9 శాతం తక్కువగానే నమోదైంది. ప్రస్తుత ఏడాది మార్చి నెల తర్వాత ఇంధన వినియోగం పెరగడం వరుసగా ఇది రెండో నెల. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందు మార్చిలో ఇంధన డిమాండ్ సాధారణ స్థాయికి తెరిగి వచ్చింది.

ఆ తర్వాత ప్రతికూల పరిస్థితుల కారణంగా డిమాండ్ సన్నగిల్లింది. అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కఠిన ఆంక్షల వల్ల గతేదాది ఆగష్టు తర్వాత మేలో వినియోగం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. జూన్‌లో ఆంక్షల సడలింపుతో ఇంధన డిమాండ్ పుంజుకునే సంకేతాలను నమోదు చేసింది. ఇంటి అవసరాలకు వాడే ఎల్‌పీజీ గ్యాస్ వినియోగం 4.05 శాతం పెరిగి 23.6 లక్షల టన్నులకు చేరుకుంది. కరోనాకు ముందు స్థాయితో పోలిస్తే ఇది 7.55 శాతం పెరిగింది.

ఇక, విమానయాన పరిశ్రమ ఇంకా ఆంక్షలను ఎదుర్కొంటున్న కారణంగా జెట్ ఫ్యుయెల్ గతేడాదితో పోలిస్తే 29.5 శాతం పెరిగి 2.91 లక్షల టన్నులుగా నమోదైనప్పటికీ, కరోనాకు ముందునాటి స్థాయితో పోలిస్తే 53.1 శాతం తక్కువగానే ఉంది.

Advertisement

Next Story