ముంబై స్టేషన్‌లో తొలి పాడ్ హోటల్!

by Shyam |   ( Updated:2021-11-22 03:11:35.0  )
Pad hotels
X

దిశ, ఫీచర్స్ : చిన్న బెడ్‌ పరిమాణమంత గదులతో కూడిన ‘క్యాప్స్యూల్ హోటల్స్’ కాన్సెప్ట్‌ను జపాన్ 1979లో ప్రపంచానికి పరిచయం చేసింది. పాశ్చాత్య ప్రపంచంలో ‘పాడ్ హోటల్’గా పిలవబడుతున్న ఈ టైనీ హోటల్స్.. కాలక్రమేణా వరల్డ్‌వైడ్‌గా ఆవిర్భవించగా ఈ మధ్య కాలంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే భారత్‌లో మొదటి ‘పాడ్ హోటల్’ ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఇటీవలే ప్రారంభమైంది. కాగా భారతీయ రైల్వే ప్రయాణికులు సహా సామాన్య ప్రజానీకం కూడా ఇకపై తక్కువ ధరలకే ఆధునిక విశ్రాంతి సౌకర్యాలను పొందే అవకాశం కలిగింది.

విమాన, బస్సు ప్రయాణ ఖర్చులతో పోలిస్తే ‘రైలు’ ప్రయాణం చవక. అందుకే రైలు బండి పేదలకు చేరువైంది. అయితే చార్జీల్లోనే బడ్జెట్ గురించి ఆలోచించే ప్రజలు.. విడిది విషయంలోనూ అదే మైండ్‌సెట్ కలిగి ఉంటారు. అందువల్ల సాంప్రదాయ హోటళ్లు అందించే విశాలమైన, ఖరీదైన గదులు అవసరంలేని లేదా ఆ ఖర్చును భరించలేని అతిథుల కోసం ఇండియన్ రైల్వే ‘పాడ్ హోటల్’‌ను పరిచయం చేసింది. ఈ హోటల్స్ సరసమైన ధరల్లో ఉత్తమ వసతిని కల్పిస్తాయి. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ పాడ్ హోటల్‌లో మొత్తం 48 చిన్న బెడ్-సైజ్ క్యాప్సూల్స్ ఉన్నాయి.

capsule Hotels

వీటిలో క్లాసిక్, ప్రైవేట్ పాడ్స్‌తో పాటు మహిళలు, వికలాంగుల కోసం ప్రత్యేక పాడ్స్ ఉన్నాయి. ప్రతీ పాడ్ రూమ్ ఉచిత Wi-Fi, టాయిలెట్ సౌకర్యంతో పాటు సామాన్లు భద్రపరిచే స్థలాన్ని అందిస్తుంది. ఇక పాడ్ లోపల టీవీ, చిన్న లాకర్, అద్దం, ఏసీ, ఎయిర్ ఫిల్టర్ వెంట్స్, రీడింగ్ లైట్స్ వంటి ఫెసిలిటీస్ కూడా పొందవచ్చు. అంతేకాదు ఇంటీరియర్ లైటింగ్, మొబైల్ చార్జింగ్ సాకెట్స్, స్మోక్ డిటెక్టర్స్ సహా ‘డోంట్ డిస్టర్బ్’ సూచికలు కూడా అమర్చారు. ఒక వ్యక్తికి 12 గంటలకు గాను రూ ₹999 నుంచి చార్జీలు మొదలవుతుండగా, 24 గంటలకు ₹1,999 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

hotels

ఆయా వ్యక్తుల అవసరాలపై ఆధారపడి టారిఫ్స్ మారవచ్చని IRCTC తెలిపింది. ప్రయాణికులు ఈ పాడ్ కాన్సెప్ట్ రూమ్స్‌లో అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను తక్కువ ధరలకే పొందవచ్చని, ముంబై సెంట్రల్ స్టేషన్‌లోని పాడ్ కాన్సెప్ట్ హోటల్.. ఇండియన్ రైల్వేస్‌లో మొదటిదని ఇండియన్ రైల్వే అధికారులు తెలిపారు.

Advertisement

Next Story