కరోనా ట్రాకింగ్ యాప్ ను విడుదల చేసిన కేంద్రం

by vinod kumar |
కరోనా ట్రాకింగ్ యాప్ ను విడుదల చేసిన కేంద్రం
X

దిశ వెబ్ డెస్క్: భారత ప్రభుత్వం ‘‘కరోనా ట్రాకింగ్ యాప్‌’’ను అధికారికంగా విడుదల చేసింది. దీనికి ఆరోగ్య సేతు (Aarogya Setu App) అని పేరు పెట్టింది. ఈ యాప్ ద్వారా మన సమీపంలో ఎవరైనా కరోనా బారిన పడితే వెంటనే తెలుసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. యాప్‌లో పేర్కొన్న డిస్క్రిప్షన్ ప్రకారం.. ఇది కోవిడ్-19కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ, వారిని అప్రమత్తం చేస్తూ ఉంటుంది. అలాగే ఈ మహమ్మారి నుంచి దూరంగా ఉండేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

మన స్మార్ట్ ఫోన్ లో లొకేషన్ ఆన్ చేసుకోవాలి. మన లోకేషన్ కు సమీపంలో ఎవరైనా కోవిడ్ సోకిన వ్యక్తి ఉన్నాడా లేదా అని ఈ యాప్ కనిపెట్టేస్తోంది. కరోనా పేషెంట్‌తో ఎవరైనా కాంటాక్ట్‌లోకి వస్తే.. వారి డేటాను ఈ యాప్ ప్రభుత్వానికి ఆ సమాచారాన్ని చేరవేస్తుంది. యాప్ ప్రైవసీ పాలసీ ప్రకారం యూజర్ల డేటాను బయటి వారితో ఈ యాప్ పంచుకోదు. కేవలం భారత ప్రభుత్వానికి మాత్రమే మీ వివరాలను షేర్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పేరు, ఫోన్ నంబర్ లాంటి వివరాలు బయటకు రావు.

ఇలా రిజిస్టర్ కావాలి:

ఈ యాప్ ఇంగ్లిష్ సహా 11 భాషలకు సపోర్ట్ చేస్తుంది. దీనిని ఉపయోగించుకోవాలంటే వినియోగదారులు తొలుత వారి మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక వినియోగదారులు ఉన్న ప్రదేశం ఆధారంగా వారు సురక్షితమైన ప్రదేశంలో ఉన్నదీ, లేనిదీ తెలియజేస్తుంది.

అప్డేట్స్:

ఆరోగ్య సేతు యాప్‌లో రాష్ట్రాల వారీగా కరోనా వైరస్ హెల్ప్ లైన్ల సమాచారాన్ని వివరంగా పొందుపరిచారు. ఇందులోని చాట్‌బోట్ ద్వారా యాప్ వాడుతున్న వారు కరోనా లక్షణాలను అర్థం చేసుకొని, ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందొచ్చు. కరోనా గురించి కేంద్ర ఆరోగ్య శాఖ అందించే అప్‌డేట్స్‌ను కూడా ఈ యాప్‌లో పొందొచ్చు. అండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న వారు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసే లైవ్ ట్వీట్లను కూడా వీక్షించే వీలుంది.

Tags : corona virus, app, arogya setu, live location, tracker, covid person, govt

Advertisement

Next Story

Most Viewed