ఇచ్చింది సరిపోదు..వృద్ధికి ఇంకా ఊతమివ్వాలి

by Shyam |
ఇచ్చింది సరిపోదు..వృద్ధికి ఇంకా ఊతమివ్వాలి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన భారీ ఆర్థిక ప్యాకేజీ కానీ, ఇటీవల పండుగ సందర్భంగా తీసుకున్న చర్యలు సరిపోవని, పరిస్థితులకు తగిన రీతిలో వృద్ధికి ఊతమివ్వాలని దేశంలోని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ఏడాది భారత ఆర్థికవ్యవస్థ దారుణంగా పతనమవనుందని, కొవిడ్-19 ప్రభావంలో దెబ్బతిన్న కార్యకలాపాలకు ఊతమివ్వడానికి, వ్యవస్థలో డిమాండ్‌ను పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న ఉద్దీపన ప్యాకేజీల ప్రభావం ఏ మాత్రం సరిపోదని ఆర్థికవేత్తలు స్పష్టం చేశారు.

రాయటర్స్ రూపొందించిన ఓ నివేదిక ఆర్థికవ్యవస్థ రికవరీపై ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న క్రాంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ ఆర్థిక పునరుజ్జీవనానికి అనేక చర్యలను ప్రకటించాయి. వైరస్‌ను నియంత్రించేందుకు వ్యాపారాలపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం తొలగించినప్పటికీ, ఆర్‌బీఐ పలు ఆర్థిక చర్యలు చేపట్టింది. అయితే, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

లాక్‌డౌన్ సమయంలో రూ. 21 లక్షల ఆర్థిక ప్యాకేజీతో పాటు ఇటీవల డిమాండ్ పెంచేందుకు పలు చర్యలను కూడా ప్రకటించింది. అయితే, ప్రభుత్వం ప్యాకేజీపై పలువురు ఆర్థికవేత్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య రాయటర్స్ అభిప్రాయాలను సేకరించి రూపొందించిన నివేదికలో సుమారు 55 మంది ఆర్థికవేత్తల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి నిరాశజనకంగా ఉంటుందని పేర్కొన్నారు. రెండు నెలలకు ముందున్న దానికంటే ఎక్కువ నిరాశవాదంగా ఉంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed