రెండో దశ ట్రయల్స్‌లో భారత టీకాలు..

by Anukaran |   ( Updated:2020-08-04 11:49:41.0  )
రెండో దశ ట్రయల్స్‌లో భారత టీకాలు..
X

న్యూఢిల్లీ : దేశీయంగా తయారవుతున్న టీకాల క్లినికల్ ట్రయల్స్ శరవేగంగా సాగుతున్నాయి. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న రెండు టీకాలు తొలిదశ ట్రయల్స్ ముగిశాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, అహ్మదాబాద్‌కు చెందిన జైదుస్ కాడిలా ఫార్మా సంస్థలు అభివృద్ధి చేస్తున్న టీకాల తొలిదశ ట్రయల్స్ దాదాపు మూడు వారాల్లోనే పూర్తయ్యాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడించారు.

భారత్ బయోటెక్ 11 సైట్‌లలో చేపట్టిన తొలి దశ ట్రయల్స్ పూర్తి చేసుకుని రెండో దశ ట్రయల్స్ మొదలుపెట్టిందని వివరించారు. అలాగే, జైదుస్ కాడిలా కూడా తొలి దశ ట్రయల్స్ ముగించుకుని 11 సైట్‌లలో రెండో దశ ట్రయల్స్ ప్రారంభించిందన్నారు. ఆక్స్‌ఫర్డ్ టీకాతో కలుపుకుని దేశంలో ప్రస్తుతం మూడు టీకాలు క్లినికల్ ట్రయల్స్‌లోని వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్ టీకా ‘కొవిషీల్డ్’ ట్రయల్స్‌ కోసం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు డీసీజీఐ అనుమతించిన సంగతి తెలిసిందే.

భారత్ బయోటెక్, జైదుస్ కాడిలా అత్యల్ప సమయంలోనే తొలిదశ ట్రయల్స్ పూర్తి చేశాయి. కరోనా ఆపత్కాలం కారణంగా తొలిదశ ట్రయల్స్ ఫలితాలు పరిశీలించకముందే రెండో దశ ట్రయల్స్ నిర్వహణకు కేంద్రం ఆమోదించింది. ఏప్రిల్ 22న డోసులు ప్రయోగించిన ఆక్స్‌ఫర్డ్ టీకా కూడా కేవలం నెల వ్యవధిలోనే తొలిదశ ట్రయల్స్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అభివృద్ధి చేస్తున్న టీకా సురక్షితమేనా కాదా? అని తొలి దశ ట్రయల్స్‌లో పరిశీలించగా, రెండో దశ ట్రయల్స్‌లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ప్రేరేపిస్తున్నదా? లేదా? అని పరీక్షిస్తారు.

Advertisement

Next Story