టీ20 సిరీస్ మనదే..

by Anukaran |   ( Updated:2020-12-06 07:44:15.0  )
టీ20 సిరీస్ మనదే..
X

దిశ, స్పోర్ట్స్ : సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా.. తమ తొలి రెండు వన్డేలను సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో కోల్పోయింది. కాన్‌బెర్రాలో మూడో వన్డేతో ప్రారంభించిన విజయాల పరంపరను.. సిడ్నీ గ్రౌండ్‌లో కొనసాగించింది. రెండో టీ20ని సిడ్నీ గ్రౌండ్‌లో గెలవడమే కాకుండా.. ఏకంగా సిరీస్ కైవసం చేసుకుంది. టీమ్ ఇండియా ముందు ఉంచిన భారీ స్కోరును కాపాడుకోవడంతో ఆసీస్ జట్టు విఫలమైంది. బౌలింగ్‌లో నటరాజన్.. బ్యాటింగ్‌లో ధావన్, కోహ్లీ, పాండ్యా రాణించడంతో రెండో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా టీమ్ ఇండియా పలు రికార్డులు కొల్లగొట్టడం విశేషం.

డెట్టాల్ టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం రాత్రి సిడ్ని క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 2వ టీ20లో ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీమ్ ఇండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఇండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (30), శిఖర్ ధావన్ (52) దూకుడుగా ఆడారు. వీరిద్దరూ బౌండరీలు సిక్సర్లతో ఆసీస్ బౌలర్లను బెంబేలెత్తించారు. ఓవర్‌కు 10 రన్‌రేట్‌తో పరుగులు సాధించిన ఈ జోడి తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం అందించింది. ఆండ్రూ టై వేసిన బంతిని షాట్ కొట్టబోయి స్వెప్సన్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవీలియన్ చేరాడు. ధావన్, కోహ్లీ కలసి రెండో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. ధావన్ ధాటిగా ఆడుతూ అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే జోరును కొనసాగించే క్రమంలో ఆడమ్ జంపా బౌలింగ్‌లో స్వెప్సన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ (40) సంజూ శాంసన్ (15) లక్ష్యం వైపు దూసుకొని పోయేలా షాట్లు ఆడారు. ఈ క్రమంలో స్వెప్సన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కోసం ప్రయత్నించిన శాంసన్.. స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ధాటిగా ఆడుతున్న కోహ్లీ (40) కూడా సామ్స్ వేసిన ఒక వైడ్ బాల్‌ను టచ్ చేసి కీపర్ వేడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత జట్టు లక్ష్యాన్ని చేరుకుంటుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా (42), శ్రేయస్ అయ్యర్ (12) ఆసీస్ బౌలర్లను చితక బాదారు. శ్రేయస్ అయ్యర్ వరుసగా 6,4 కొట్టి మ్యాచ్‌ను ముందుకు తీసుకొని వెళ్లగా.. హార్దిక్ పాండ్యా వరుసగా బౌండరీలు, సిక్సులు కొట్టి లక్ష్యానికి చేర్చాడు. పాండ్యా 19వ ఓవర్లో రెండు బౌండరీలు.. 20 ఓవర్లో రెండు సిక్సులు కొట్టడంతో భారత జట్టు మరో రెండు బంతులు మిగిలి ఉండగాన్నే లక్ష్యాన్ని ఛేదించింది. సామ్స్, టై, స్వెప్సన్, జంపా తలా ఒక వికెట్ తీశారు. హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఆసీస్ భారీ స్కోర్..

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఫించ్ గౌర్హాజరీలో కెప్టెన్సీ చేస్తున్న వేడ్ (52) చెలరేగి ఆడాడు. మరో ఓపెనర్ షార్ట్(9) తో కలసి తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. గత మ్యాచ్‌లో ఆదుకున్న షార్ట్ ఈ సారి నటరాజన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. స్మిత్, వేడ్ కలసి రెండో వికెట్‌కు 28 పరుగులు జోడించారు. వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను మిస్ చేసిన కెప్టెన్ కోహ్లీ.. చాకచక్యంగా వ్యవహరించి అతడిని రనౌట్ చేశాడు. దీంతో 75 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్మిత్ (46), మ్యాక్స్‌వెల్ (22) కలిసి భారత బౌలర్లను చితకబాదారు. నటరాజన్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయగా… మిగతా వాళ్లు మాత్రం భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. వీరిద్దరూ కలసి మూడో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. అయితే ఠాకూర్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ భారీ షాట్‌కు ప్రయత్నించి వాషింగ్టన్ సుందర్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. స్మిత్‌తో కలసి స్టొయినిస్ (16) బౌండరీలు బాదారు. స్మిత్ అవుటైనా.. చివర్లో వచ్చిన సామ్స్ కూడా జత కలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ సాధించిది. నటరాజన్ 2 వికెట్లు తీయగా, ఠాకూర్, చాహల్ తలా ఒక వికెట్ తీశారు.

స్కోర్ బోర్డు :

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్

మాథ్యూ వేడ్ (రనౌట్) 58, మాథ్యూ షార్ట్ (సి) శ్రేయస్ అయ్యర్ (బి) నటరాజన్ 9, స్టీవ్ స్మిత్ (సి) పాండ్యా (బి) చాహల్ 46, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (సి) వాషింగ్టన్ సుందర్ (బి) ఠాకూర్ 22, మోసెస్ హెన్రిక్స్ (సి) కేఎల్ రాహుల్ (బి) ఠాకూర్ 26, మార్కస్ స్టొయినిస్ 16 నాటౌట్, డేనియల్ సామ్స్ 8 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లు) 194/5

వికెట్ల పతనం : 1-47, 2-75, 3-120, 4-168, 5-171

బౌలింగ్ : దీపక్ చాహర్ (4-0-48-0), వాషింగ్టన్ సుందర్ (4-0-35-0), శార్దుల్ ఠాకూర్ (4-0-39-1), నటరాజన్ (4-0-20-2), యజువేంద్ర చాహల్ (4-0-51-1)

ఇండియా ఇన్నింగ్స్ :

కేఎల్ రాహుల్ (సి) స్వెప్సన్ (బి) ఆండ్రూ టై 30, శిఖర్ ధావన్ (సి) స్వెప్సన్ (బి) ఆడమ్ జంపా 52, విరాట్ కోహ్లీ (సి) వేడ్ (బి) సామ్స్ 40, సంజూ శాంసన్ (సి) స్మిత్ (బి) స్వెప్సన్ 15, హార్దిక్ పాండ్యా 42 నాటౌట్, శ్రేయస్ అయ్యర్ 12 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.4 ఓవర్లు) 195/4

వికెట్ల పతనం : 1-56, 2-95, 3-120, 4-149

బౌలింగ్ : డేనియల్ సామ్స్ (3.4-0-41-1), సీన్ అబాట్ (2-0-17-0), ఆండ్రూ టై (4-0-47-1), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (1-0-19-0), స్వెప్సన్ (4-0-25-1), మోసెస్ హెన్రిక్స్ (1-0-9-0) ఆడమ్ జంపా (4-0-36-1)

Advertisement

Next Story