తుది సమరంలో టీమిండియా గెలిచేనా..?

by Anukaran |   ( Updated:2021-03-27 09:29:08.0  )
తుది సమరంలో టీమిండియా గెలిచేనా..?
X

దిశ, స్పోర్ట్స్ : తొలి వన్డేలో 317 పరుగులు చేసిన టీమ్ ఇండియా లక్ష్యాన్ని కాపాడుకోగలిగింది. ఆ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ పటిష్టంగా కనపడింది. కానీ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు 251 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రెండో వన్డేలో భారత్ 236 పరుగులు చేసింది. గత మ్యాచ్ కంటే స్కోర్ ఎక్కువే. దీంతో తొలి వికెట్‌కు మరో సారి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మాన్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పినా.. టీమ్ ఇండియా అభిమానులు మాత్రం మ్యాచ్ భారత్ గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కానీ ఈ సారి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. రెండో వికెట్‌కు కూడా భారీ భాగస్వామ్యం సాధించారు. బెన్ స్టోక్స్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఇంగ్లాండ్ మరో 39 బంతులు ఉండగానే భారీ లక్ష్యాన్ని ఛేదించింది.

వరుస ఓటములతో ఉన్న ఇంగ్లాండ్ జట్టు.. ఈ మ్యాచ్‌తో పూర్తి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. మరోవైపు భారత బౌలింగ్ దళంలోని లోపాలు పూర్తిగా బయటపడ్డాయి. భువీ నుంచి కృనాల్ వరకు ఎవరూ పరుగులు ఆపలేక వికెట్లు తీయలేక ఆపసోపాలు పడ్డారు. ఇక కీలకమైన చివరి మ్యాచ్ ఆదివారం జరుగనున్నది. దీంతో విజయం సాధించే జట్టే సిరీస్ విజేతగా నిలుస్తుంది. టెస్టు, టీ20లతో పాటు వన్డే సిరీస్‌ను కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని టీమ్ ఇండియా భావిస్తుండగా.. కనీసం వన్డే సిరీస్ అయినా నెగ్గి పరువు నిలుపుకోవాలని ఇంగ్లాండ్ అనుకుంటున్నది.

మొదటి నుంచి దూకుడుగా ఆడాల్సిందే..

టీమ్ ఇండియా తొలి రెండు వన్డేల్లో అనుసరించిన వ్యూహం కారణంగా 40 నుంచి 50 పరుగులు స్కోర్ చేసింది. మొదట్లో నెమ్మదిగా ఆడుతూ వికెట్లు కాపాడుకోవవానికి ప్రాధాన్యత ఇచ్చి.. ఆఖరి 15 ఓవర్లలో దూకుడు పెంచుతున్నది. దీంతో స్కోర్ 300 దాటినా ప్రత్యర్ధి ముందు సరిపోవడం లేదు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వికెట్లు కాపాడుకోవడం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి.. తమ సహజశైలిలో దూకుడుగా ఆడాల్సి ఉంది. పవర్ ప్లేలో సాధ్యమైనన్ని పరుగులు సాధించడం వల్ల తర్వాత వచ్చే బ్యాట్స్‌మాన్‌పై ఒత్తిడి లేకుండా చూడాలి. తద్వారా వాళ్లు స్వేచ్చగా ఆడి మరిన్ని పరుగులు సాధించగలుగుతారు. ఈ సిరీస్‌లో ఓపెనింగ్ జోడీ నెమ్మదిగా ఆడటం వల్లే భారత జట్టు మరిన్ని పరుగులు చేయగలిగే అవకాశాలను కోల్పోయింది. ఇక కోహ్లీ వరుసగా అర్దశతకాలు సాధిస్తున్నాడు. కానీ గతంలో మాదిరిగా వాటిని శతకాలుగా మార్చాల్సిన అవసరం ఉన్నది. రిషబ్ పంత్ తన వికెట్‌ను నిర్లక్ష్యంగా పారేసుకోవడం కూడా మానేయాలని నిపుణులు చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా మరింత నిలకడగా ఆడాల్సి ఉన్నంది. బ్యాట్స్‌మెన్ మార్పు దాదాపు ఉండకపోవచ్చు.

ఇక బౌలింగ్‌లో భారీ మార్పులు ఖాయమని తెలుస్తున్నది. భువీ తక్కువ పరుగులు ఇస్తూ.. అసవరమైన బ్రేక్ త్రూలు ఇస్తున్నాడు. అనుభవం లేని ప్రసిధ్ కృష్ణ కూడా వికెట్లు తీస్తున్నాడు. కానీ శార్దుల్ ఠాకూర్ నిర్లక్ష్యమైన బంతులు విసురుతున్నాడు. దీంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ అతడినే టార్గెట్ చేసి పరుగులు రాబట్టుకుంటున్నారు. అతడి స్థానంలో నటరాజన్ లేదా మహ్మద్ సిరాజ్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ సిరీస్‌లో పూర్తిగా విఫలమైన కుల్దీప్ యాదవ్ బదులు యజువేంద్ర చాహల్‌ను తీసుకుంటారని సమాచారం. వికెట్లు తీయడంలో విఫలమవుతున్న ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా స్థానంలో వాషింగ్టన్ సుందర్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ మ్యాచ్‌లో బౌలర్లే కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది.

పటిష్టంగా ఇంగ్లాండ్..

తొలి మ్యాచ్ ఓడిపోయినా.. ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంత పటిష్టంగా ఉంటుందో రెండో వన్డేలో తెలిసొచ్చింది. పూర్తి ఫామ్‌లో ఉన్న టాపార్డర్‌కు తోడు బెన్ స్టోక్స్ కూడా టచ్ లోకి రావడం ఇంగ్లాండ్‌కు శుభపరిణామం. మోర్గాన్ గైర్హాజరీలోనూ ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించింది. అరంగేట్ర బ్యాట్స్‌మాన్ లియామ్ లివింగ్‌స్టన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడాడు. దీంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మాన్ జోరు చూపించే అవకాశం ఉన్నది. ఇక బౌలింగ్‌లో పేసర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతున్నారు. స్పిన్ బౌలర్లు కాస్త తడబడుతున్నా.. పేసర్లు మాత్రం టీమ్ ఇండియాపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా టాస్ కీలకంగా మారనున్నది. రాత్రి సమయంలో మంచు ప్రభావం ఉండటం, పూర్తి ఫ్లాట్ పిచ్ కావడంతో టాస్ గెలిచిన జట్టుకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

జట్ల అంచనా :

ఇండియా : శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా/వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్/నటరాజన్/సిరాజ్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ

ఇంగ్లాండ్ : జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టన్, దావీద్ మలన్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్/టామ్ కర్రన్, రీస్ టోప్లే

వేదిక : మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే
సమయం : మధ్యాహ్నం 1.30 గంటలు
లైవ్ : స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్
స్ట్రీమింగ్ : డిస్నీ + హాట్‌స్టార్

Advertisement

Next Story