ఆసీస్‌లో సమఉజ్జీల పోరు మొదలైంది

by Anukaran |   ( Updated:2020-11-26 22:25:20.0  )
ఆసీస్‌లో సమఉజ్జీల పోరు మొదలైంది
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా రెండు నెలల సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 3 వన్డేల సిరీస్‌ ప్రారంభమైంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, కరోనా మహమ్మారి నేపథ్యంలో తొమ్మిది నెలల తర్వాత భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నది. ప్రస్తుతం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో తలపడుతుంది.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనే కాకుండా ఆస్ట్రేలియా గడ్డపై మంచి రికార్డు ఉన్న రోహిత్ శర్మ, గాయం కారణంగా దూరమవడం టీమ్ ఇండియాకు పెద్ద లోటనే చెప్పుకోవాలి. శిఖర్ ధావన్, రోహిత్‌ల జోడి ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనింగ్ జోడీల్లో ఒకటి. రోహిత్ లేకపోవడంతో ఇప్పుడు ధావన్‌కు తోడుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్‌లలో ఒకరు బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉన్నది. అయితే, గత పర్యటన కంటే ఇది భారత జట్టుకు కఠినంగా ఉండబోతున్నది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో అత్యంత బలంగా ఉన్నది. పైగా సొంత గడ్డపై ఆస్ట్రేలియా జట్టు తన ప్రత్యర్థిని మరింతగా బెంబేలెత్తిస్తుంది. కాబట్టి కోహ్లీ సేనకు ఈ పర్యటన సవాలు కాబోతున్నది.

లోతైన బ్యాటింగ్ లైనప్

టీమ్ ఇండియాతో పోల్చుకుంటే ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉన్నది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, లబుషానే, ఆరోన్ ఫించ్, మార్కస్ స్టొయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, పాట్ కమ్మిన్స్‌తోపాటు ఇటీవల బ్యాట్‌తో కూడా రాణిస్తున్న మిచెల్ స్టార్క్ ఉండటం గమనార్హం. ఈ లైనప్‌ను ఛేదించాలంటే బూమ్రా, షమీలకు పెద్ద పరీక్ష లాంటిది. ఇక టీమ్ ఇండియాలో ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్, పాండ్యా తర్వాత బ్యాటింగ్ చేసే వాళ్లు లేరు. హార్ధిక్ పాండ్యా ఒక్కడే ఆల్‌రౌండర్ కావడంతో బ్యాటింగ్ లైనప్ అక్కడితోనే ఆగిపోతున్నది. తుది జట్టులో రవీంద్ర జడేజా ఉంటే బ్యాటింగ్ బలం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, జడేజా ఐపీఎల్‌లో స్పిన్నర్‌గా విఫలం కావడంతో అతడికి చోటు దక్కుతుందా లేదా అనేది అనుమానమే.

భారమంతా కోహ్లీ పైనే..

రోహిత్ గైర్హాజరీతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై మరింత భారం పడే అవకాశం ఉన్నది. అయితే, గత పర్యటనలో కోహ్లీ మూడు వన్డేల్లో 183 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా అతడికి సిడ్నీ గ్రౌండ్‌లో పేలవమైన రికార్డు ఉన్నది. న్యూజీలాండ్ పర్యటన తర్వాత కోహ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం మళ్లీ ఇదే. అయితే, ఐపీఎల్‌లో బ్యాటుతో బాగానే రాణించడంతో అదే ఫామ్‌ను కొనసాగించే అవకాశం ఉన్నది. ఓపెనర్లు కనుక మంచి భాగస్వామ్యం అందిస్తే, ఆ తర్వాత కోహ్లీ పని సులువు అవుతుంది. ఒకవేళ వాళ్లు విఫలమైతే మాత్రం కోహ్లీ కచ్చితంగా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాల్సిందే. ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకు 40 వన్డేలు ఆడిన కోహ్లీ 54.57 సగటుతో 1,910 పరుగులు చేశాడు. గత పర్యటనలో సిడ్నీ గ్రౌండ్‌లో తప్ప మిగతా రెండు మ్యాచ్‌లలో కోహ్లీ విశేషంగా రాణించాడు. ఈ పర్యటనలో కూడా భారత్ బలం బ్యాటింగే కాబట్టి కోహ్లీ సహా మిగతా బ్యాట్స్‌మెన్ రాణిస్తేనే ఆస్ట్రేలియాకు అడ్డుకట్ట వేయొచ్చు.

Advertisement

Next Story

Most Viewed