అంతర్జాతీయ హాకీకి ఎస్వీ సునిల్ గుడ్‌బై

by Shyam |
India veteran
X

దిశ, స్పోర్ట్స్: భారత పురుషుల హాకీ జట్టు సీనియర్ ఆటగాడు ఎస్వీ సునిల్ అంతర్జాతీయ హాకీ నుంచి రిటైర్ అవుతున్నట్లు శుక్రవారం ప్రకటించాడు. 2014 ఏసియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన టీమ్ఇండియాలో ఎస్వీ సునిల్ సభ్యుడు. అంతేకాకుండా 2018 ఏసియన్ గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచాడు. 2014లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో టీమ్ ఇండియా రజత పతకం గెలిచిన జట్టులో కూడా సునిల్ ప్రాతినిధ్యం వహించాడు. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లో భారత జట్టు తరపున ఆడాడు. అయితే ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌ తుది జట్టులో మాత్రం స్థానం సంపాదించలేకపోయాడు. అనూహ్యంగా భారత జట్టు టోక్యోలో రజత పతకం సాధించింది. 2007 ఆసియా కప్ ద్వారా అంతర్జాతీయ హాకీలోకి అరంగేట్రం చేసిన సునిల్.. 14 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. త్వరలో జరుగనున్న నేషనల్ క్యాంప్‌కు తాను అందుబాటులో ఉండబోవడం లేదని సునిల్ పేర్కొన్నాడు.

‘నా శరీరం, నా హృదయం ఆటను కొనసాగించమని చెబుతున్నాయి. కానీ, నా మనసు మాత్రం చిన్న విరామం తీసుకోమని చెబుతున్నది. 14 ఏళ్ల తర్వాత నేను భారత జట్టు జెర్సీని పక్కకు పెట్టాలని నిర్ణయం తీసుకుంటున్నాను. వచ్చే వారంలో ప్రారంభం కానున్న జాతీయ శిక్షణ కార్యక్రమానికి దూరంగా ఉండబోతున్నాను. ప్రస్తుతానికి విరామం మాత్రమే. త్వరలోనే మళ్లీ వస్తాను’ అని సునిల్ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. 2024లో భారత హాకీ జట్టు స్వర్ణ పతకం గెలవాలనే లక్ష్యం పెట్టుకున్నది. ఈ సమయంలో యువ క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలి. అందుకే తాను తప్పుకుంటున్నానని సునిల్ పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed