ఐసీసీ ఎలైట్ ప్యానల్‌లో నితిన్ మీనన్

by  |
ఐసీసీ ఎలైట్ ప్యానల్‌లో నితిన్ మీనన్
X

దిశ, స్పోర్ట్స్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతి ఏడాది ప్రకటించే అంపైర్ల ఎలైట్ ప్యానల్‌లో ఇండియాకు చెందిన నితిన్ మీనన్ చోటు దక్కించుకున్నారు. 2020-21 సీజన్‌కుగాను ఐసీసీ ప్రకటించిన ప్యానల్‌లో నితిన్ మీనన్ కూడా ఉన్నట్లు సోమవారం ప్రకటించిన లిస్టులో తెలిపింది. ఈ సీజన్‌లో చోటు దక్కించుకున్న అతి పిన్న వయస్కుడు (36 ఏళ్లు) అయిన అంపైర్‌గా నితిన్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఆయన మూడు టెస్టు మ్యాచ్‌లు, 24 వన్డేలు, 16 టీ20లకు అంపైరింగ్ చేశారు. ఎలైట్ ప్యానల్ నుంచి ఇంగ్లండ్‌కు చెందిన నిగెల్ ఎన్‌లాంగ్ తప్పుకోవడంతో ఆ స్థానం నితిన్‌కు లభించింది. గతంలో ఐసీసీ ఎలైట్ ప్యానల్‌లో భారత్ నుంచి శ్రీనివాస్ వెంకటరాఘవన్, సుందరం రవిలు ఉండేవాళ్లు. వెంకటరాఘవన్ రిటైర్ అవ్వగా, సుందరం రవిని ఐసీసీ గత ఏడాది ప్యానల్ నుంచి తప్పించింది. ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డైస్ నేతృత్వంలోని సభ్యులైన సంజయ్ మంజ్రేకర్, రంజన్ మదుగులే, డేవిడ్ బూన్ ప్యానల్ నితిన్‌ను ఎంపిక చేసింది. ‘నా తండ్రి నరేంద్ర మీనన్ కూడా అంతర్జాతీయ అంపైరే. 2006లో బీసీసీఐ అంపైర్ల కోసం నిర్వహించిన పరీక్ష రాశాను. మా నాన్న చెప్పిన తర్వాతే ఈ పరీక్ష రాసి అంపైర్ అయ్యాను. నాకు అంపైరింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఎలైట్ ప్యానల్‌కు ఎంపిక కావడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు రుణపడి ఉన్నాను’ అని నితిన్ మీనన్ అన్నారు.


Next Story

Most Viewed