తగ్గినట్టే తగ్గుతూ.. అంతలోనే పెరుగుతూ..!

by Aamani |   ( Updated:2020-04-21 00:47:39.0  )
తగ్గినట్టే తగ్గుతూ.. అంతలోనే పెరుగుతూ..!
X

దిశ, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కరోనా వైరస్(కొవిడ్-19) గజగజ వణికిస్తున్న ది. తగ్గినట్టే తగ్గుతూ… తాజా నివేదికల్లో పెరుగుతుండడం కలవరం రేపుతున్నది. వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు నమోదు కాకపోవడం, గతంలో వచ్చిన కేసులకు చికిత్సలు చేయడం, క్వారంటైన్‌లో ఉంచడం పూర్తి కావడంతో కరోనా తగ్గుముఖం పట్టినట్లు భావించారు. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ కలెక్టర్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేసి తమ జిల్లాలో కరోనా తగ్గుముఖం పడుతుందని ప్రకటించారు.

తాజా కేసులతో కలవరం…

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కొత్త కేసులు నమోదు అవుతుండడం అధికార వర్గాల ఆందోళనకు కారణమవుతోన్నది. గత రెండు రోజుల వ్యవధిలోనే ఉమ్మడి జిల్లాలో కేసుల సంఖ్య పెరిగింది. గతవారం ఆదిలాబాద్ జిల్లాలో 14 కేసులు మాత్రమే ఉండగా సోమవారం ఒకేసారి 5 కొత్త కేసుల నమోదుతో ఆ జిల్లాలో కేసుల సంఖ్య 19కి చేరింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడు కేసులు మాత్రమే ఉండగా… తాజాగా జైనూరు మండల కేంద్రంలో తాత మనవళ్లకు కరోనా సోకి కేసులు ఐదుకు పెరిగాయి. ఇక నిర్మల్ జిల్లాలో గతవారం అంతా కరోనా ప్రభావం లేదన్నట్లుగా కనిపించింది. సోమవారం తానూర్ మండల కేంద్రంలో ఒక వ్యక్తికి కరోనా సోకడం, నిజామాబాద్ జిల్లా కేంద్రం దవాఖానాలో ఆయన మృతి చెందడం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలోనూ ఒక మహిళ మృతి చెందిన నేపథ్యంలో అక్కడ 103 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. వీటి ఫలితాలు నేడో రేపో రానున్నాయి. ఇది కూడా మంచిర్యాల జిల్లాలో ఆందోళన కలిగిస్తోన్నది.

ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా…

కరోనా కట్టడి కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడికక్కడ ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా కరోనా తగ్గుముఖం పట్టడంలేదని అధికార యంత్రాంగం ఆందోళన పడుతోంది. ఆయా జిల్లాల కలెక్టర్లు అధికార యంత్రాంగంతో కలిసి పగలు, రాత్రి కష్టపడుతున్నా అదుపులోకి రాకపోవడం ఆందోళనకు కారణం అవుతున్నది. రోజూ ఏదో ఒక సాకు చెప్పి లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న సంఘటనలు ఆయా జిల్లాల్లో కుప్పలుతెప్పలుగా నమోదవుతున్నాయి. సామాజిక దూరం పాటించాలన్న స్పృహ ఇంకా ప్రజల్లో రాకపోవడం విచారకరం. కరోనా లక్షణాలున్న ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రాకపోతుండటమే దీనికి ప్రధాన కారణం అని నిర్మల్ జిల్లా కరోనా ప్రత్యేక అధికారి డాక్టర్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో సహకరిస్తే గానీ కరోనా అదుపులోకి రాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags: Adilabad, corona virus, officers, corona cases, Collectors

Advertisement

Next Story

Most Viewed