3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లు దిగుమతి: జవహర్ రెడ్డి

by srinivas |
3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లు దిగుమతి: జవహర్ రెడ్డి
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షల నిర్ధారణకు 3 లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లను దిగుమతి చేసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని, కరోనా విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఆయన చెప్పారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందో ఆయన వివరించారు.

టీబీ పరీక్షలు చేసే ట్రూనాట్ సెంటర్లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఇలా చేయవచ్చని ఐసీఎంఆర్ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఏపీలో కరోనా పరీక్షల కోసం 240 ట్రూనాట్ సెంటర్లున్నాయని ఆయన వెల్లడించారు. 20 లక్షల పీపీఈలు, 14 లక్షల ఎన్ 95 మాస్కులు సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. కరోనాని మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు 20 లక్షల హైడ్రోక్లోరోక్వీన్ మాత్రలు, 14 లక్షలు అజిత్రోమైసిన్ మాత్రలు సిద్ధంగా ఉన్నాయని ఆయన ప్రకటించారు.

మరోవైపు రాష్ట్రంలో కరోనా హాట్ స్పాట్ లను గుర్తిస్తున్నామని, గుర్తించిన ఏరియాల్లో కఠినంగా ఆంక్షలు అమల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. ర్యాపిడ్ టెస్టుల ద్వారా కరోనా ఎంత మందికి వ్యాపించిందో తెలుస్తుందని, జిల్లాకు వంద నమూనాల చొప్పున సేకరించామని చెప్పారు. ఫిబ్రవరి 5 నాటికి రాష్ట్రంలో కేవలం 90 మందికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉండేదని, ఇవాళ వెయ్యి మందికి పరీక్షలు నిర్వహించే స్థాయికి చేరామని ఆయన ప్రకటించారు. త్వరలో దీనిని మూడు వేల నుంచి నాలుగు వేల మందికి పరీక్షలు నిర్వహించే స్థాయికి పెంచుతామని ఆయన చెప్పారు.

ఏపీలో కోవిడ్-19 వైద్యం కోసం నాలుగు ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయని చెప్పిన జవహర్ రెడ్డి, ఈ ఆసుపత్రుల్లో మూడు షిఫ్టులలో మూడు బృందాలు పనిచేస్తున్నట్టు తెలిపారు. జిల్లాకు ఒక కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని చూస్తున్నామని అన్నారు. ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి రాష్ట్రానికి తిరిగొచ్చిన వారు వెయ్యి మంది వరకు ఉన్నారని చెప్పారు. మర్కజ్ కు వెళ్లినవారు, వాళ్లు కలిసిన వాళ్లతో సహా మొత్తం 3500 మంది నమూనాలు సేకరించామని చెప్పారు. ‘కరోనా’ పాజిటివ్ కేసులు 314 నమోదయ్యాయని, ఇందులో 260కి పైగా మర్కజ్ కి వెళ్లొచ్చిన వారేనని వివరించారు.

Tags: corona virus, covid-19, fight against covid-19, andhra pradesh, jawahar reddy, health cs

Advertisement

Next Story

Most Viewed