భారతీయులకు షాక్.. H1-B వీసాలివ్వొద్దని బైడెన్‌కు వినతి!

by vinod kumar |
భారతీయులకు షాక్.. H1-B వీసాలివ్వొద్దని బైడెన్‌కు వినతి!
X

దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ అమెరికన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అడ్వొకసీ గ్రూపు భారతీయులకు కొత్తగా హెచ్-1బీ వీసాలు జారీ చేయొద్దని జో బైడెన్ ప్రభుత్వాన్ని కోరింది. గ్రీన్‌కార్డుల విషయమై దేశాలవారీ పరిమితి(కంట్రీ-క్యాప్)పై నెలకొన్న సందిగ్ధత తొలిగిపోయే వరకు భారతీయులకు హెచ్-1బీ వర్క్ వీసాలు ఇవ్వొద్దని పేర్కొంది. ఇప్పటికే గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయుల సంఖ్య భారీగా ఉన్నందున.. మళ్లీ కొత్తగా వీసాలు జారీ చేస్తే ఈ సమస్య మరింత జఠిలం అవుతుందని తెలియజేసింది. ఈ ఏడాది కొత్తగా మరో 60వేల మంది వరకు భారతీయులు వీసాలు పొందే అవకాశం ఉందని, దీంతో గ్రీన్‌కార్డుల కోసం మరింత కాలం వేచి చూడాల్సి పరిస్థితి దాపురిస్తుందని పేర్కొంది. ఈ ఏడాది కూడా లాటరీ పద్దతిలోనే హెచ్-1బీ వీసాలు ఇవ్వనున్నట్లు ఇటీవల బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఇండియన్ ఇమ్మిగ్రేషన్ అడ్వొకసీ ఈ విన్నపం చేసింది. ఇక 2022 ఏడాదికి గాను మార్చి 9 నుంచి హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని ఇప్పటికే బైడెన్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే.

బైడెన్​ బృందం తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాది 60వేల మంది భారతీయులు వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశముందని ఇమ్మిగ్రేషన్ వాయిస్ సంస్థ ప్రెసిడెంట్ అమన్ కపూర్ తెలిపారు. ప్రతిభలేని ఉద్యోగులు, వలసవాదుల వీసాల ప్రాసెసింగ్‌తో ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులతో పాటు మరికొందరు మాత్రమే బైడెన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో లాభపడతారని ఆయన పేర్కొన్నారు. కనుక గ్రీన్‌కార్డులపై దేశాలవారీగా ఉన్న పరిమితి తొలిగిపోయే వరకు భారతీయులకు కొత్తగా వీసాలు జారీ చేయకపోవడం మంచిదని అమన్ కపూర్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ మళ్లీ కొత్తగా వీసాలు ఇస్తే.. ఇంతకుమునుపే గ్రీన్‌కార్డుల కోసం చాలాకాలంగా వేచి చూస్తున్న భారతీయులు మరిన్ని ఏళ్లు వెనక్కి వెళ్లిపోతారని చెప్పారు. కాగా, ప్రతి యేటా అగ్రరాజ్యం 85,000 కొత్త హెచ్-1బీ వీసాలు జారీ చేస్తుంది. వీటిలో సుమారు 70 శాతం వీసాలు(దాదాపు 60వేలు) భారతీయ వర్కర్లకు జారీ అవుతున్నట్లు ఇమ్మిగ్రేషన్ అడ్వొకసీ గ్రూపు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed