బీజేపీలో చేరను.. ఇంకా కాంగ్రెస్ మనిషినే: సచిన్ పైలట్

by Shamantha N |
బీజేపీలో చేరను.. ఇంకా కాంగ్రెస్ మనిషినే: సచిన్ పైలట్
X

న్యూఢిల్లీ: బీజేపీలో చేరడం లేదని, తాను ఇంకా కాంగ్రెస్ మనిషినేనని రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తెతిపారు. ‘నేను బీజేపీలో చేరడం లేదు. ఆ పార్టీలో చేరే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేస్తున్నా. గాంధీల దృష్టిలో నన్ను విలన్‌ను చేయడం కోసం బీజేపీతో సంబంధాలను అంటగట్టారు. నేనింకా కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిని’ అని ఆపేర్కొన్నారు. మంగళవారం సచిన్ పైలెట్‌ను రాజస్థాన్ డిప్యూటీ సీఎం పదవి నుంచి భర్తరఫ్ చేయడమే కాకుండా, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలిగించిన విషయం విదితమే.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన సచిన్ పైలట్ ముఖ్యమంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్ వృద్ధ నేత అశోక్ గెహ్లాట్‌ను సీఎం పదవి వరించింది. పైలట్‌ డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇరు నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించడానే ఆరోపణలతో సచిన్ పైలట్‌పై విచారణకు సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మాజీ డిప్యూటీ సీఎంకు సమన్లు కూడా జారీ అయ్యాయి. ఈ చర్యను అవమానంగా భావించిన సచిన్ పైలట్ ఆదివారం తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.

గత మార్చిలో మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లో కీలక యువనేత జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీని వీడారు. అతని అనుంగ ఎమ్మెల్యేలకు హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకూడదని భావించిన ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా పలుమార్లు మాజీ డిప్యూటీ సీఎంతో సంప్రదింపులు జరిపారు. కానీ, ఆయన పట్టువీడకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సచిన్ పైలట్‌ను అన్ని పదవుల నుంచి ఉద్వాసన పలికింది.

ప్రస్తుత సీఎం అశోక్‌కు గెహ్లాట్‌కు తనను ముఖ్యమంత్రిగా ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని సచిన్ పైలట్ డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఆయన స్పందిస్తూ ‘నేను రాజస్థాన్ ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాను. మన చర్యలకు అనుగుణంగా భవిష్యత్తు నిర్ణయం’ అవుతుందన్నారు.

దివంగత కాంగ్రెస్ అగ్రనేత రాజేశ్ పైలట్ కుమారుడే సచిన్ పైలట్. 2000లో తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో 26ఏండ్ల ప్రాయంలోనే సచిన్ పైలట్ ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తర్వాతి తరం నేతలుగా రాహుల్‌గాంధీతోపాటు జ్యోతిరాదిత్య సింధియా, మిలింద్ దేవ్రా, సచిన్ పైలట్ గుర్తింపు పొందారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్నారు. ఇక, అప్పటి నుంచి ఈ యువ నేతలకు కష్టాలు మొదలయ్యాయి. ఒక్కొక్కరుగా పార్టీని వీడటం మొదలు పెట్టారు.

2018లో ఎన్నికల్లో విజయానంతరం రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం నుంచి సచిన్ ‌పైలట్ వెనక్కి తగ్గేలా రాహుల్ గాంధీ ఒత్తిడి తీసుకువచ్చారు.

Advertisement

Next Story

Most Viewed