చేయి తడిపితే చాలు.. అనుమతులు లేని సెల్లార్లు

by Anukaran |
చేయి తడిపితే చాలు.. అనుమతులు లేని సెల్లార్లు
X

దిశ,మెదక్: కాదేదీ కబ్జాకనర్హం అన్నట్టు పట్టణంలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. మెదక్ పట్టణ పరిసరాలల్లో కబ్జాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. రాజకీయ అండదండలు ఉన్నాయని చెబుతూ అక్రమ నిర్మాణాల పరంపర కొనసాగడం గమనార్హం.

అక్రమాలకు అంతేలేదు..

ఇటీవల కాలంలో పట్టణ విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతోంది దీంతో బహుళ అంతస్థుల భవనాల కట్టడాలు కూడా అంతే స్థాయిలో పెరిగిపోతున్నాయి. జీ ప్లస్ ఆపై కట్టడాలకు అనుమతులు లేవు, కానీ డీటీసీసీ నుంచి అనుమతులు ఉన్నాయని కొందరు, స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్లు ఇచ్చారని ఇంకొందరు ప్రచారం చేసుకుంటూ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. పేద మధ్య తరగతి ప్రజలు చిన్నపాటి నిర్మాణాలు వారి సమీప ప్రాంతాల్లో చేపడితే నానా హడావుడి చేసి నోటీసులు అందించి, వాటిని కూల్చే వరకు నిద్రపోని అధికార యంత్రాంగం ఈ అక్రమ కట్టడాల విషయంలో మాత్రం మిన్నకుండిపోవడం పట్ల అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక సెల్లార్ల వంతు..

తాజాగా ఇటీవల కాలంలో జిల్లా కేంద్రంలో సెల్లార్ల కట్టడాలు పెరిగిపోతున్నాయి. అనుమతులు లేకుండానే 36 నుంచి 48 ఫిల్లర్లతో ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం సెల్లార్లు కట్టాలంటే మైనింగ్, రెవెన్యూ, ఏహెచ్ గ్రౌండ్ వాటర్, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులతో పాటు, టౌన్ ప్లానింగ్ అధికారులు వెరిఫై చేసి వీటికి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ పట్టణంలో జరుగుతున్న ఏ ఒక్క సెల్లార్లకు అధికారికంగా అనుమతులు లేవు. వీటికి సంబంధించిన దరఖాస్తులు మాత్రం సంబంధిత టౌన్ ప్లానింగ్ లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.
అధికారుల అనుమతులు ఉన్నాయని చెబుతూ పనులు కానిచ్చేస్తున్నారు.

పొలిటికల్ అండతోనే..

ఇటీవల పట్టణంలోని నర్సిఖేడ్ వీధికి చెందిన ఓ వ్యక్తి 36 ఫిల్లర్లతో సెల్లార్ మొదలు పెట్టాడు. ఈ వ్యవహారంలో స్థానికంగా ఉన్న కౌన్సిలర్ అత్యుత్సాహం ప్రదర్శించడమే కాకుండా దగ్గరుండి మరీ పనులు చేపిస్తున్నాడు. చైర్మన్‌తో పాటు ఇతర అధికారులను మేనేజ్ చేస్తానని చెప్పి దండిగా డబ్బులు గుంజినట్టు ఆరోపణలున్నాయి. విషయం కాస్త మున్సిపల్ చైర్మన్‌కు తెలియడంతో సదరు కౌన్సిలర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఒక్క బహుళ అంతస్తుల నిర్మాణాలే కాకుండా మాస్టర్ ప్లాన్ రోడ్లతో పాటు బఫర్ జోన్లలో కూడా అక్రమ కట్టడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.

కౌన్సిలర్ బూతు పురాణం..

స్థానిక 10వ వార్డు కౌన్సిలర్ సుంకయ్య సెల్లార్ల ఫోటోలు తీయడానికి వెళ్లిన జర్నలిస్ట్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన అనుమతి లేకుండా నా గల్లీకే వస్తారా అని నానా దుర్భాషలాడారు. కౌన్సిలర్ తీరుపై జర్నలిస్ట్ సంఘాల నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, శంకర్ దయాల్ చారి, సురేందర్ రెడ్డిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌన్సిలర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

అనుమతులు లేవు

పట్టణంలో బహుళ అంతస్తుల భవనాలకు సెల్లార్లకు ఎలాంటి అనుమతులు లేవు. కొంత మంది వ్యాపారులు అనుమతుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ ఎవరికీ ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు. అక్రమంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

-దేవరాజ్, అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి

Advertisement

Next Story

Most Viewed