ప్రజల్లో కరోనా యాంటీ బాడీస్.. అర్బన్‌లో 80%, రూరల్‌లో 60 %

by Anukaran |   ( Updated:2021-08-10 22:28:18.0  )
corona antibodies
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లో 80 శాతం మందికి కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందితే, రూరల్ ఏరియాల్లో 60 శాతం మందికి ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అంతర్గత సర్వేలో తేలింది. వీరిలో 50 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా, మరో 25 శాతం మంది వైరస్ బారిన పడినవారిగా ఆరోగ్యశాఖ గుర్తించింది. ప్రధాన కార్యదర్శికి అందించిన నివేదికలో వైద్యాధికారులు ఈ వివరాలను పేర్కొన్నారు. ఇటీవల చేపట్టిన అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని, దీంతోనే కేసులు కూడా తగ్గుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే గతంలో ఎన్ఐఎన్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్), ఐసీఎంఆర్ (ఇండియ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సంయుక్తంగా చేసిన అధ్యయనంలో 64 శాతం మందిలో మాత్రమే యాంటీ బాడీస్ ఉత్పత్తి అయినట్లు తేలింది.

హైదరాబాద్ నగరంతో పాటు జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మాత్రమే ఈ సర్వేను నిర్వహించారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఈ జిల్లాలను మినహాయించింది. రాష్ట్రంలో సగటున 70 శాతానికి ప్రజల్లో పైగా యాంటీ బాడీలు ఉన్నట్లు తేలడంతో ఈసారి హైదరాబాద్ నగరంతో పాటు మిగతా అన్ని జిల్లాల్లో మరోసారి సీరో సర్వే నిర్వహించాల్సిందిగా వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన సహకారాన్ని ఇవ్వాల్సిందిగా ఎన్ఐఎన్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. త్వరలో సర్వే తేదీలు ఖరారు కానున్నాయి.

ఒక్కో జిల్లాలో 600 శాంపిల్స్ …

గతంలో ఎన్ఐఎన్-ఐసీఎంఆర్ సంయుక్తంగా నిర్వహించిన సీరో సర్వేలో జిల్లాకు 400 చొప్పున శాంపిల్స్ సేకరించగా, ఈసారి మాత్రం ఒక్కో జిల్లాకు 600 చొప్పున నమూనాలను తీసుకోబోతున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రతీ జిల్లాలో పది వేర్వేరు గ్రామాలను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. 12 ఏళ్ల పైబడిన వ్యక్తుల నుంచి నమూనాలు తీసుకుంటామన్నారు. శరీరంలో పుట్టిన యాంటిబాడీలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటున్నాయని, ఎవరిలో ఎంత కాలం ఉంటాయనేది శాస్త్రవేత్తలు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. కానీ థర్డ్ వేవ్ ప్రమాదాన్ని కేంద్ర వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తున్నందున తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే ప్రజలు ఏ మేరకు తట్టుకోగలరో ఈ సర్వే ద్వారా తేలుతుందని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

ఇప్పటివరకు సర్వేలో వెల్లడైన అంశాలను బట్టి యాంటీ బాడీల ప్రభావం డిసెంబరు వరకు ఉండొచ్చని, అందువల్ల థర్డ్ వేవ్ వచ్చినా తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత మాత్రం ప్రజల ప్రవర్తనకు అనుగుణంగా వైరస్ వ్యాప్తి ఆధారపడి ఉంటుందన్నారు. ఇప్పటిదాకా వైరస్‌కు ఇన్‌ఫెక్ట్ కానివారిని, వ్యాక్సిన్ వేసుకోని వారిని ‘సస్‌సెప్టిబుల్ గ్రూప్’గా విభజించి టీకాలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ బాధ్యతను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని మెడికల్ ఆఫీసర్లతో పాటు గ్రామాల్లోని ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలకు అప్పజెప్పినట్లు తెలిపారు.

ముప్పు పూర్తిగా తొలగలేదు

రాష్ర్టంలో ఇప్పటికి నాలుగుసార్లు సీరో సర్వేలు జరిగాయి. గతేడాది మే నెలలో తొలి రౌండ్, ఆగస్టులో రెండో రౌండ్, డిసెంబర్‌‌లో మూడో రౌండ్ జరగ్గా, గత నెలలో నాలుగో రౌండ్ జరిగింది. తెలంగాణలో ప్రతి నలుగురిలో ఒకరికి (24.1 శాతం మందికి) కరోనా యాంటిబాడీస్ ఉన్నట్టు గతేడాది డిసెంబర్‌‌ సర్వేలో తేలింది. ఈ ఏడాది జూన్ సర్వే నాటికి ఇది 60.1 శాతానికి పెరిగింది. పదేండ్లలోపు పిల్లల్లో 45 శాతం మందికి అసలు యాంటీబాడీసే లేనట్లు తేలింది. అయితే యాంటిబాడీస్ ఉన్నవారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉన్నదని, మాస్కులు పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం లాంటి చర్యల ద్వారా వైరస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొవిడ్ నిబంధనలను మరికొంతకాలం పాటించాల్సిందేనని ఎన్ఐఎన్‌కు చెందిన సర్వే లీడ్ సైంటిస్టు డాక్టర్ లక్ష్మయ్య తెలిపారు.

ఎన్ఎన్ఎన్ గతంలో చేసిన సర్వే లో యాంటీబాడీల శాతం…

రౌండ్ జనగామ నల్గొండ కామారెడ్డి మొత్తం
మొదటి సర్వే 0.49 0.24 0.24 0.33
రెండో సర్వే 18.2 11.1 6.9 12.2
మూడో సర్వే 24.8 22.9 24.7 24.1
నాలుగో సర్వే 58.76 55.88 65.61 60.1

Advertisement

Next Story