ఇండియాలో ఫ్రాంచైజీలే బుకీలు.. మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు..!

by Anukaran |   ( Updated:2021-03-05 05:51:00.0  )
ఇండియాలో ఫ్రాంచైజీలే బుకీలు.. మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు..!
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్‌ను పట్టి పీడిస్తున్న ‘ఫిక్సింగ్’ భూతాన్ని సమూలంగా నాశనం చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నడుం భిగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బుకీలు, ఫిక్సర్ల వివరాలను ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) సేకరించింది. క్రికెట్‌లో అవినీతికి బుకీలే కారణమని.. వీళ్లే మ్యాచ్‌ల ఫిక్సింగ్‌కు పాల్పడుతూ ఆటకు మచ్చ తీసుకొస్తున్నారని ఐసీసీ అంటున్నది. గతంలో వైర్ ట్రాన్స్‌ఫర్ (ఆన్‌లైన్), హవాలా ద్వారా మాత్రమే ఫిక్సింగ్ జరిగేదని.. కానీ ఇప్పుడు అనేక వేరే మార్గాల్లో డబ్బు చేతులు మారుతున్నట్లు ఐసీసీ చెబుతున్నది. గత కొన్ని వారాలుగు ఐసీసీ ఏసీయూ ఆధ్వర్యంలో దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నదని.. ఇండియాకు చెందిన 12 మంది బుకీలే ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు ఏసీయూ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ ‘టెలిగ్రాఫ్ స్పోర్ట్స్’ అనే మీడియా సంస్థకు వెల్లడించారు.

ఫిక్సర్లు భారతీయులే..

మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్న బుకీలలో 12 మంది ఇండియాకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు ఐసీసీ దర్యాప్తులో వెల్లడైంది. ప్రపంచంలో ఏ దేశంలో ఎలాంటి మ్యాచ్ జరిగినా ఇండియాకు చెందిన బుకీలే ఫిక్సింగ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ, బర్నర్ ఫోన్లు, ఆటో డిలీట్ ఆప్షన్ ఉన్న మెసేజింగ్ యాప్స్ ఉపయోగిస్తూ మ్యాచ్‌లు ఫిక్స్ చేస్తున్నారని ఐసీసీ చెబుతున్నది. ఇప్పటికే 10 నుంచి 12 మంది వివరాలు పూర్తిగాసేకరించారు. ఐసీసీ ఏసీయూ అధికారులు ప్రస్తుతం ఢిల్లీలో ఒక బుకీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఫిక్సింగ్ చేస్తున్న ఈ 12 మంది నేరుగా ఎప్పుడూ ఆటగాళ్లతో సంబంధాలు పెట్టుకోరని.. ఒక మధ్యవర్తి ద్వారా క్రికెటర్లను సంప్రదించి ఫిక్సింగ్ చేస్తున్నారని అలెక్స్ వెల్లడించారు. ప్రతీ మ్యాచ్‌కు ఒక కొత్త ‘బర్నర్ ఫోన్’, కొత్త పేరుతో ఈ బుకీలు రంగంలోకి దిగుతున్నట్లు కూడా గుర్తించారు. త్వరలోనే వీరి వివరాలు కూడా వెల్లడిస్తామని ఐసీసీ తెలిపింది.

బుకీలే ఫ్రాంచైజీ ఓనర్లు..

దేశంలోని పలు రాష్ట్రాల అసోసియేషన్లు సొంతగా టీ20 లీగ్స్ నిర్వహిస్తున్నాయి. ఈ లీగ్స్‌కు సంబంధించిన ఫ్రాంచైజీలలో కొంత మంది బుకీలు యజమానులుగా ఉన్నట్లు ఐసీసీ గుర్తించింది. దీనిపై బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ ఇప్పటికే దర్యాప్తు చేసి కర్ణాటకకు చెందిన ఒక కోచ్, క్రికెటర్లపై కేసులు కూడా నమోదు చేసింది. ముంబయి టీ20 లీగ్‌కు చెందిన ఫ్రాంచైజీలో ఫిక్సింగ్‌కు పాల్పడే బుకీకి వాటా ఉన్నట్లు కూడా వెల్లడైంది. కేవలం ఫిక్సింగ్ చేయడానికే పలు ఫ్రాంచైజీలలో వాటాలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు ఫాంటసీ లీగ్ కంపెనీలు కూడా కొన్ని లీగ్స్ నిర్వహిస్తున్నాయి. ఇటీవల పంజాబ్‌లోని ఒక క్లబ్ మైదానంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించారు. కానీ ఆన్‌లైన్‌లో అది శ్రీలంకలో జరుగుతున్న క్రికెట్ లీగ్‌గా పేర్కొంటూ బుకీలు బెట్టింగ్స్ నిర్వహించారు. దీనిపై బీసీసీఐ ఆరా తీయగా ఢిల్లీకి చెందిన ఒక బుకీ ఇందులో కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. ఐసీసీ కూడా ఈ వివరాలను సేకరించింది.

ఇలా చెక్..

బుకీలు, ఫిక్సర్లపై కేసులు నమోదు చేసి జైలుకు పంపినా ఒకటి రెండేళ్లలో విడుదలవుతూ తిరిగి ఫిక్సర్లుగా మారుతున్నారు. ఇందు కోసం ఐసీసీ కొత్త ఫార్ములా కనిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుకీలు, ఫిక్సర్ల వివరాలను బహిరంగంగా వెల్లడించాలని నిర్ణయించింది. ఐసీసీ వెబ్‌సైట్‌లో ఎవరు ఫిక్సర్లు, ఎవరు బుకీలు.. వారి అసలు పేర్లు ఏమిటి? ఏయే నకిలీ పేర్లు కలిగి ఉన్నారనే వివరాలన్నీ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అంతే కాకుండా ఈ వివరాలన్నీ మీడియాకు విడుదల చేయడం ద్వారా వారిని కట్టడి చేయాలని ఐసీసీ భావిస్తున్నది. క్రికెటర్లందరికీ కూడా వీరి వివరాలను అందజేసి అప్రమత్తం చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed