- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియా అలర్ట్.. ఉగ్రపోరుకు అడ్వాన్సుడ్ రైఫిల్స్
దిశ, తెలంగాణ బ్యూరో : ఆప్ఘనిస్తాన్ పరిణామాలతో భారత హోం శాఖ అప్రమత్తమైంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోకి చొరబాట్ల నివారణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి పారామిలిటరీ భద్రతా బలగాలు వాడుతున్న ఏకే-47 తుపాకులకు దీటుగా అడ్వాన్సుడుగా ఉన్న ఏకే-103 తుపాకులను సమకూర్చుకునేలా రష్యా ప్రభుత్వంతో భారత్ అత్యవసర ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇందుకోసం రూ. 300 కోట్లను కేటాయించింది. రెండు మూడు నెలల్లోనే సుమారు 70 వేల తుపాకులు దిగుమతి కానున్నాయి. ప్రస్తుతం అక్కడి భద్రతా బలగాలు వాడుతున్న ఏకే-47 తుపాకులను యథావిధిగా కొనసాగిస్తూనే ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ తుపాకుల స్థానంలో ఏకే-103 రైఫిళ్లను ఇవ్వాలని కేంద్ర హోంశాఖ భావిస్తున్నది. అన్ని విమానాశ్రయాలకు ప్రస్తుతం ఇన్సాస్ తుపాకులతో కల్పిస్తున్న భద్రతను ఇకపైన ఏకే-103 రైఫిళ్లతో కొనసాగించనున్నది.
సెకండ్ ఫేజ్‌లో మాత్రం సుమారు లక్షన్నర ఏకే-203 మోడల్ రైఫిళ్లను భారత ప్రభుత్వం సమకూర్చుకోనున్నది. ప్రస్తుతం నేవీలో వాడుతున్న ఏకే-103 పనితీరుపై సంతృప్తి వ్యక్తం కావడంతో విమానాశ్రయాల్లోని సీఐఎస్ఎఫ్ భద్రతా బలగాలకు, జమ్మూ కాశ్మీర్‌లోని లడఖ్, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లోని పారామిలిటరీ బలగాలకు కూడా ఏకే-103 రైఫిళ్లనే ఇవ్వాలనుకుంటున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాజా పరిస్థితులతో అక్కడి అమెరికా సైనికులు వదలివెళ్ళిన తుపాకులను ఉగ్రవాదులు చేజిక్కించుకున్నందున ఏదో ఒక రూపంలో భారత్‌లోకి ఆ ఆయుధాలతో వచ్చే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఆయుధ సంపత్తిని పటిష్టం చేసుకోవడంపై రక్షణ, హోం శాఖలు దృష్టి పెట్టాయి.
ఒకవైపు చైనా ఆర్మీ.. మరోవైపు ఆప్ఘనిస్తాన్ సంక్షోభం
ఇప్పటికే చైనా ఆర్మీ అమెరికాలో తయారైన ’సిగ్ సార్స్’ రకం రైఫిళ్ళను వాడుతున్నాయి. తూర్పు లడఖ్ ప్రాంతంలో చైనా బలగాలన్నీ వీటినే వాడుతుండడంతో అధునాతన రైఫిళ్ళను సమకూర్చుకోవడం ఉత్తమం అని కేంద్రం భావించింది. సిగ్ సార్స్ రకం రైఫిళ్ళను ఇప్పటికే భారత నేవీ బలగాలు వాడుతున్నాయి. మరోవైపు ఆఫ్గనిస్తాన్ తాజా పరిణామాలతో అప్రమత్తం అవుతున్నది. ఏ క్షణం ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా యుద్ధ క్షేత్రంలో సర్వ సిద్ధంగా ఉండేలా సరికొత్త మార్పులు అవసరమని కేంద్ర హోం, రక్షణ శాఖలు భావించాయి. ఇప్పటికే చైనాతో పలుమార్లు జరిగిన స్వల్ప ఘర్షణలు కూడా ఇందుకు కారణం. భద్రతా బలగాల్లో ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని పలుమార్లు అనుకున్నా.. చివరకు రంగం సిద్ధమైంది.
ప్రస్తుతం లేటెస్ట్ ఏకే-103, 203 రకం రైఫిళ్ళనే కాకుండా అమెరికాకు చెందిన సిగ్ సార్స్ రైఫిళ్ళను కూడా సుమారు లక్షన్నర వరకు సమకూర్చుకున్నది. మరో 16 వేల ’నెగేవ్ మెషిన్ గన్’లను కూడా కొనుగోలు చేసింది. వీటికి అదనంగా ఇకపైన కే-103, 203 మోడల్ రైఫిళ్ళు కూడా భారీ సంఖ్యలోనే ఆర్మీ, పారా మిలిటరీ బలగాలకు చేరనున్నాయి. దేశం మొత్తం మీద సుమారు ఆరున్నర లక్షల ఏకే-103, 203 తుపాకులను సమకూర్చుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ భావన. ’గరుడ్ ’ బలగాల పేరుతో ప్రధాన విమానాశ్రయాల దగ్గర ఉన్న భద్రతా బలగాలకు కూడా ఇవే రకం తుపాకులను సమకూర్చనున్నది.
ఏకే-103 ప్రత్యేకత ఏంటి..?
ప్రస్తుతం విస్తృతంగా వాడుతున్న ఏకే-47 మోడల్ రైఫిళ్లకంటే ఏకే-103 కాస్త అడ్వాన్సు స్థాయిలో ఉంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రైఫిల్ విడిభాగాలు తుప్పుపట్టడం, త్వరగా పనికిరాకుండా పోవడం లాంటి సమస్యలు నూతన రకం రైఫిల్‌లో ఉండవు. భౌగోళిక పరిస్థితులకు తగినట్లుగా రైఫిల్‌కు నైట్ విజన్, టెలిస్కోప్ లాంటివి బిగించుకోవచ్చు. మరోవైపు ఏరియా వెపన్‌గా భావించే గ్రెనేడ్‌ను కూడా ప్రత్యేకంగా లాంఛర్ లాంటివి వాడకుండా ఏకే-103 రైఫిల్‌తోనే ప్రయోగించే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం ఏకే-47 రైఫిల్‌లో పిస్టల్ గ్రిప్, హాండ్ గార్డ్స్, ఫోర్ ఆర్మ్, బట్ స్టాక్ లాంటి చోట్ల ఇనుము, చెక్కను వాడుతున్నందున నిత్యం వర్షం, మంచు కురిసే ప్రాంతాల్లో తొందరగా చెడిపోతున్నాయి.
అయితే ఏకే-103 రైఫిళ్లకు ఇలాంటి చోట్ల ఫైబర్, ప్రత్యేక రకమైన ప్లాస్టిక్ (షాటర్ ప్రూఫ్) వాడుతున్నందున తుప్పుపట్టడం, చెడిపోవడం లాంటి సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. దీనికి తోడు బరువు కూడా గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా భద్రతా బలగాలు వేగంగా కదలడానికి, యుద్ధ క్షేత్రంలో వినియోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. మరోవైపు ఏకే-47 తుపాకులకు వాడుతున్న బుల్లెట్లు, వాటి మేగజైన్‌లనే ఏకే-103 రైఫిళ్ళకు కూడా వాడుకోడానికి వీలుంటుంది. ఒక్కో మేగజైన్‌లో 30 బుల్లెట్లను వాడుకోవచ్చు. కానీ దీనికోసమే ప్రత్యేకంగా మేగజైన్ తయారుచేసినందువల్ల 30 బుల్లెట్లు ఉండే ఒక మేగజైన్ బరువు దాదాపు 200 గ్రాముల మేర తగ్గుతుంది.
సెకండ్ ఫేజ్‌లో ఏకే-203 రైఫిల్స్
ప్రస్తుతం ఏకే-103 రకం తుపాకులను అత్యవసరంగా 70 వేల మేరకు సమకూర్చుకోడానికి ఒప్పందం కుదిరినా వచ్చే సంవత్సరానికి సుమారు లక్షన్నర ఏకే-203 మోడల్ రైఫిళ్ళను సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. దీంతో ఇప్పుడు వాడుతున్న ఇన్సాస్ రైఫిళ్ళన్నింటినీ పక్కన పెట్టి ఇకపైన ఏకే-103 లేదా 203 రైఫిళ్ళనే ’ఇన్‌ఫాంట్రీ అస్సాల్ట్ స్టాండర్డ్ వెపన్’గా తీసుకురావాలనుకుంటున్నది. యుద్ధ క్షేత్రంలోకి అదనపు బలగాలను పంపాలనుకున్నప్పుడు వారు వాడుతున్న ఏకే-47 బుల్లెట్లను, మేగజైన్‌లనే వాడుకునే వెసులుబాటు ఉండడం ఈ కొత్త మోడల్ రైఫిళ్ల ప్రత్యేకత.