ఆ పోర్టుఫోలియోను పటిష్టం చేసే యోచనలో హ్యూండాయ్

by Harish |
ఆ పోర్టుఫోలియోను పటిష్టం చేసే యోచనలో హ్యూండాయ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో అమ్ముడవుతున్న మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో ఎస్‌యూవీ విభాగం మెరుగైన వృద్ధిని సాధిస్తోందని ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూండాయ్ కంపెనీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో హ్యూండాయ్ మోటార్ ఇండియా దేశీయంగా తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేయాలని భావిస్తోంది. దీనిద్వారా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం హ్యూండాయ్ మోటార్ ఇండియా దేశీయంగా 7-సీటర్ మోడల్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ‘ప్రస్తుతం భారత్‌లో ఆటో పరిశ్రమను ఎస్‌యూవీ విభాగం ముందుకు తీసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ విభాగంలో ముందున్నాయి.

భారత్ ఇప్పుడే మొదలైన నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత పటిష్టం చేసే దిశగా ప్రణాళికను సిద్ధం చేశామని’ హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎండీ, సీఈవో ఎస్ ఎస్ కిమ్ తెలిపారు. 2020లో హ్యూండాయ్ మొత్తం 1.8 లక్షల యూనిట్ల ఎస్‌యూవీలను విక్రయించినట్టు పేర్కొంది. ఇందులో ముఖ్యంగా వెన్యూ, క్రెటా, టక్సన్ మోడళ్లు మార్కెట్లో మెరుగైన ఆదరణ సాధించాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దేశీయంగా ఇటీవల కాలంలో ఎస్‌యూవీ అమ్మకాలు పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది. 2019లో అమ్ముడైన మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో ఎస్‌యూవీ కార్ల అమ్మకాలు 25 శాతం ఉండగా, 2020 నాటికి 29 శాతం పెరిగింది. ఇక, ఈ ఏడాది జనవరిలో ఇది 33 శాతానికి పెరగడం గమనార్హం.

Advertisement

Next Story