ఎస్‌యూవీ వాహనాలకు మెరుగైన డిమాండ్ : హ్యూండాయ్ మోటార్ ఇండియా

by Harish |
Hyundai
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహనాల తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లోని ఎస్‌యూవీ వాహన విభాగంలో మరింత వృద్ధి సాధించగలదని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే ఎస్‌యూవీ వాహనాల్లో వెన్యూ, క్రెటా, టక్సన్, కొత్తగా మార్కెట్లోకొచ్చిన అల్కాజర్ లాంటి మోడళ్లతో మెరుగైన మార్కెట్ వాటాను కలిగి ఉందని, ప్రతి నెలా ఈ విభాగంలో ఆధిక్యతను సాధిస్తున్నామని కంపెనీ అభిప్రాయపడింది. ‘భారత మార్కెట్లో ఎస్‌యూవీ వాహనాల పట్ల వినియోగదారుల ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. మొత్తం ప్యాసింజర్ వాహనాల విభాగంలో ఎస్‌యూవీల వాటా నెలవారీగా అధికమవుతోంది. జనవరి నుంచి జూలై మధ్య 36 శాతం వాటా నమోదవగా, ఒక్క జూలైలో ఇది 37 శాతానికి పెరిగింది. కాబట్టి ఎస్‌యూవీల వాటా మెరుగైన ధోరణిలో ఉందని’ హ్యూండాయ్ మోటార్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సేవల డైరెక్టర్ తరుణ్ గార్గ్ అన్నారు.

ఇప్పటికే హ్యూండాయ్ నుంచి వచ్చిన ఎస్‌యూవీ వాహనాల అమ్మకాలు స్థిరంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే కంపెనీ కొత్త అల్కాజర్ మోడల్ తీసుకొచ్చింది. దీనిద్వారా అదనంగా ఈ విభాగంలో మరిన్ని అమ్మకాలు సాధించేందుకు వీలవుతుందని ఆయన తెలిపారు. కొవిడ్ మహమ్మారి మొదటి వేవ్ తర్వాత వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లలో పెరిగిన విధంగానే సెకెండ్ వేవ్ తర్వాత ఎస్‌యూవీ విభాగంలో వాహన అమ్మకాల డిమాండ్ బలంగా పుంజుకుంటుందని తరుణ్ గార్గ్ వివరించారు. గతేడాది ఎక్కువగా గ్రామీణ మార్కెట్లో గిరాకీ నమోదవగా, ఈసారి పట్టణ, గ్రామీణం రెండుచోట్ల నుంచి డిమాండ్ అధికంగా ఉంది. ఈ ఏడాది జూన్‌లో అల్కాజర్ మోడల్ వచ్చినప్పటికీ హ్యూండాయ్ తన క్రెటా మొడళ్ల విక్రయాలు స్థిరంగా ఉండటం సంతోషమని తరుణ్ గార్గ్ వెల్లడించారు.

Advertisement

Next Story