హ్యూండాయ్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి సరికొత్త వాహనం

by Harish |
హ్యూండాయ్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి సరికొత్త వాహనం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా తన సరికొత్త ఎస్‌యూవీ అల్కజార్ వాహనాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రూ. 16.3 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య దీని ధరను నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రిస్టీజ్, ప్లాటినమ్, సిగ్నేచర్ వంటి మూడు వేరియంట్లలో ఈ ఎస్‌యూవీ వాహనం లభిస్తుందని శుక్రవారం కంపెనీ వెల్లడించింది. ప్రతి వేరియంట్‌లోనూ ఆటోమెటిక్ గేర్ ఆప్షన్ ఉంటుందని తెలిపింది. 6, 7 సీట్లతో లభించే అల్కజార్ మోడల్ ద్వారా భారత్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎస్‌యూవీ విభాగంలో సంస్థ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంది.

హ్యూండాయ్ మోటార్ ఇండియా ఇప్పటికే వెన్యూ, క్రెటా, కోనా ఎలక్ట్రిక్ వంటి మోడళ్లతో దేశీయ ఎస్‌యూవీ మార్కెట్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కారు మోడల్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో లభిస్తుందని, రెండు ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పెడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌లని అందించనున్నట్టు కంపెనీ వివరించింది. పెట్రోల్ వేరియంట్ 14.5 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనుండగా, డీజిల్ వేరియంట్ 20.4 కిలోమీటర్ల మైలీజీ ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎస్‌యూవీ విభాగంలో ఉన్న ఎంజీ హెక్టార్ ప్లస్, మహీంద్రా, టాటా సఫారీ మోడళ్లకు అల్కజార్ పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ‘ఈ ఏడాదితో భారత మార్కెట్లో 25 ఏళ్లకు పూర్తి చేసుకున్నాం. ఈ సమయంలో దేశీయ వినియోగదారులు ప్రీమియం మోడల్‌లో కోరుకునే సరికొత్త ఫీచర్లతో అల్కజార్ కారును తీసుకొచ్చామని’ హ్యూండాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ ఎస్ఎస్ కిమ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed