ఆ సత్తా నాకుంది.. ఒక్క అవకాశం ఇవ్వండి : గెల్లు

by Shyam |
Huzurabad TRS candidate Gellu Srinivas Yadav
X

దిశ, కమలాపూర్: ‘‘నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా.’’ అని హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మరెడ్డితో కలిసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని, ప్రజల సేవ చేసుకుంటానని, నియోజకవర్గంలో ఏ పనైనా చేసి పెట్టే సత్తా, దమ్ము తనకు ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా లేని ‘రైతుబంధు, దళితబంధు’ వంటి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోన్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రం ఏర్పడకముందు, ఏర్పడ్డాక పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనించాలని తెలిపారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం అని వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న తనపై ఎన్నో కేసులు ఉన్నాయని, మన ప్రాంతం విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశానని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు.

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి, నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు కోసం వచ్చే బీజేపీ నాయకులను నల్ల చట్టాలపై నిలదీయాలని సూచించారు. నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్ ధరలు నిత్యం పెంచుతూ పెనుభారం మోపుతోన్న బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని, అందుకు కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed