గెలుపుకోసమేనా..? ఆ గణపతి చెంత హుజురాబాద్ క్యాండిడేట్స్

by Shyam |   ( Updated:2021-09-14 01:11:02.0  )
గెలుపుకోసమేనా..? ఆ గణపతి చెంత హుజురాబాద్ క్యాండిడేట్స్
X

దిశ, అచ్చంపేట : రాష్ట్రవ్యాప్తంగా బొజ్జ గణపయ్యకు ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న బొజ్జ గణపతి విభిన్న రకాలుగా పూజలు అందుకుంటున్నాడు. కానీ నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలోని ఆదర్శనగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఒక వినూత్నమైన రీతిలో నూతన ఆలోచన విధానాన్ని అమలు చేస్తూ కాలనీ వాసులు వినాయకుడి విగ్రహం చుట్టూ ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా ఏర్పాటు చేసిన మండపం పలువురిని ఆకర్షిస్తోంది.

హుజురాబాద్ ఎన్నికలు..

ప్రస్తుతం రాష్ట్రంలో అధికార మరియు అన్నిపార్టీల వారికి హాట్‌టాపిక్ ఏదైనా ఉందంటే అది హుజురాబాద్ ఎన్నికలే. అందరి నోట హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అని పెద్దఎత్తన చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రం ఆదర్శనగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ, గణపతి చుట్టూ హుజురాబాద్ ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల క్యాండిడేట్లు విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు ప్రత్యేక ఆకర్షణగా ఉత్సవ కమిటీ నాయకులు బొమ్మలు ఏర్పాటు చేశారు. ఇది అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఏఏ నాయకుని ప్రదర్శనలు..

బొజ్జ గణపయ్య విగ్రహం చుట్టూ హుజురాబాద్ ఎన్నికల బరిలో నిలిచిన అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ పార్టీ నుండి మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ తరఫున కొండా సురేఖ నాయకుల బొమ్మలతో కూడిన చిత్రాలు వినాయకుని చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నట్టుగా నిర్వాహకులు ఏర్పాటు చేయడం గమనార్హం.

గణపయ్య ఆశీస్సులు ఎవరికి..

హుజురాబాద్‌లో అధికార టీఆర్ఎస్ మరియు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విజయం మాదంటే మాదని ఎవరికి వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బొజ్జ గణపయ్య హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఎవరివైపు నిలుస్తారు. ఎవరికి విజయం కట్టబెడుతారో అనేది ఎన్నికల అనంతరం ఫలితాలు వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

ప్రత్యేకంగా ఉండాలనే..

వినాయక చవితికి మండపాలు ఏర్పాటు చేసి గణేష్‌ను అందరూ ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే, అందరిలానే సహజంగా వినాయక మండపం ఏర్పాటు చేయడం కాకుండా… ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు హుజురాబాద్ వైపు చూస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల బొమ్మలను ఏర్పాటు చేశాం. అంతేకాకుండా బొజ్జ గణపయ్యకు నాయకులు ప్రదక్షిణలు చేసేలా పెడితే అందరి దృష్టి ఈ గణపతి మండపం వైపే ఉంటుంది. అందువల్లే ఈ రకంగా గణపతి చుట్టూ నాయకుల బొమ్మలు ఏర్పాటు చేసినట్టు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకుడు శివ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed