హుజురాబాద్‌లో ఎత్తులకు పైఎత్తులు.. రంగంలోకి ప్రధాన పార్టీలు

by Sridhar Babu |
Huzurabad-by-election
X

దిశప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారం శనివారం నుంచి ఊపందుకోనుంది. ఇప్పటివరకు టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా రేంజ్‌లో ప్రచారం నిర్వహించాయి. రేపటి నుంచి కాంగ్రెస్ నాయకత్వం కూడా రంగంలోకి దిగబోతోంది.

కాంగ్రెస్ ఇన్‌చార్జీలు..

అభ్యర్థిని ప్రకటించిన తరువాత హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఇప్పటివరకు అంతంత మాత్రంగానే సాగింది. అయితే, మండలాల వారీగా ఇన్‌చార్జీలకు బాధ్యతలు అప్పగించడంతో దసర పండగ తర్వాత నుంచి ప్రచారం జోరుగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా మండలాల ఇన్‌చార్జీలతో పాటు ఇతర బాధ్యులు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను కూడా తయారు చేసుకున్నట్టు తెలిసింది.

బీజేపీ కీలక నిర్ణయం…

బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేపట్టనున్నారు. రాష్ట్ర కమిటీ సమావేశం అనంతరం సంజయ్ హుజురాబాద్‌లో జరపనున్న ప్రచార ప్రణాళికలు తయారు కానున్నాయి. సంజయ్‌తో పాటు కేంద్ర మంత్రులు, జాతీయస్థాయి నాయకులు హుజురాబాద్‌లో పర్యటించేందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నారు. మరో 13 రోజుల్లో ప్రచారం ముగియనున్నందున ఈటల గెలుపు కోసం ముఖ్య నాయకులకు బాధ్యతలను అప్పగించారు.

టీఆర్ఎస్ దూకుడు..

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా దూకుడుగా ప్రచారం చేయాలని భావిస్తోంది. సీఎం కేసీఆర్‌తో ఒకటి లేదా రెండు పర్యటనలు చేయించే యోచనలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ముఖ్య నాయకులు, మంత్రులతో పర్యటనలు చేయించి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed