బీజేపీకి షాక్.. రాజీనామా చేసిన కీలక నేత

by Sridhar Babu |   ( Updated:2021-10-31 06:16:55.0  )
Jillepally JVR
X

దిశ, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు జిల్లేపల్లి వెంకటేశ్వర్లు(జేవీఆర్) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజీనామా లేఖను పంపారు. ఆ లేఖలో రాజీనామాకు దారితీసిన కారణాలతో పాటు, పార్టీ స్టేట్ ఆర్గనైంజిగ్ జనరల్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్ పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. జేవీఆర్ పంపిన లేఖ వివరాలు ఇలా ఉన్నాయి.

ఎన్నికలలో హుజూర్ నగర్ సీటు ఇప్పిస్తామని చెప్పి బీజేపీ స్టేట్ ఆర్గనెజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పదవిని వదులుకుని అప్పటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరినప్పటికీ తనకు న్యాయం జరగలేదని వాపోయారు. ఆ తర్వతా ఎంతో ఖర్చు చేసి పార్టీ కోసం సభలు నిర్వహించామని తెలిపారు. ఎన్నికల సమయంలో మంత్రి శ్రీనివాస్ అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కుమ్మక్కై తనను కాదని హుజూర్ నగర్ సీటు మరొకరికి కేటాయించి, ఎటువంటి సంబంధం లేని కోదాడ టికెట్ తనకు ఇచ్చారని ఆరోపించారు.

ఉత్తమ్ కుమార్ రెండు నియోజకవర్గాలకు గెలుపు కోసం చేసిన రాజకీయ ఎత్తుగడలో శ్రీనివాస్ పడిపోయాడని పేర్కొన్నారు. బీసీ ఓట్లను చీల్చి కోదాడలో ఉత్తమ్ భార్య పద్మావతి గెలవడానికే తనకు టిక్కెట్ ఇచ్చారని అన్నారు. 2 వేల బీసీ ఓట్లు తనకు పడటంతో టీఆర్ఎస్ అభ్యర్ధి మల్లయ్య యాదవ్ స్వల్ప మెజారిటీకి పడిపోయారని గుర్తు చేశారు. మంత్రి శ్రీనివాస్ చేసిన తప్పును ప్రశ్నించినందుకే, పార్టీకి దూరంగా ఉంచాలని భావించారని విమర్శించారు. చివరకు నమ్ముకున్న కేడర్ తనను వదిలిపెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. తనకు జరిగిన మోసాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Advertisement

Next Story